ఎల్లో జెర్సీలో ధోని ఇక క‌నిపించ‌డా?…. కూల్ స‌మాధానం ఇచ్చిన మిస్ట‌ర్ కూల్

మ‌హేంద్రసింగ్ ధోని.. ఈ పేరు క్రికెట్ చరిత్ర‌లో ఓ సెన్సేష‌న్. జార్ఖండ్ డైన‌మైట్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ధోని కొద్ది రోజుల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అంద‌రిని షాక్‌కు గురి చేశాడు. ధోని రిటైర్మెంట్ నిర్ణ‌యంపై క్రీడా పండితులు, విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కు ధోని ఆడ‌తాడ‌‌ని అంద‌రు భావించిన‌ప్పటికీ, స‌డెన్‌గా త‌న నిర్ణ‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి క్రికెట్ ప్రేమికుల‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్‌లో కొన‌సాగుతాన‌ని ధోని చెప్ప‌డంతో కొంత ఊర‌ట చెందారు.

ఇక బ్లూ క‌ల‌ర్ జెర్సీలో క‌నిపించని ధోని కేవ‌లం ఎల్లో జెర్సీలో మాత్ర‌మే క‌నిపిస్తాడు. ఐపీఎల్ టీం చెన్నె సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంటాడు. అయితే ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ సిరీస్‌లో ధోని చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌ర‌చ‌లేదు. దీంతో ధోని ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డిచింది. ఈ క్ర‌మంలో నేడు కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్ కోసం టాస్ వేయ‌డానికి వ‌చ్చిన ధోనిని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానీ మోరిసన్‌ ‘ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్‌ ఇదేనా?’ అంటూ అడిగాడు. దీనికి ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా క‌చ్చితంగా కాదు అని స‌మాధానం ఇచ్చాడు ధోని . దీంతో వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లోను ధోని ఆడ‌తాడ‌ని అభిమానుల‌కు అర్ధ‌మైంది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఇది చెత్త రికార్డ్‌. 12 సీజన్స్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకున్న ఈ టీం తొలిసారి ప్లే ఆఫ్స్‌కు ముందే నిష్క్ర‌మిస్తుంది. ఇది చాలా మంది అభి్మానుల‌కు ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. అయితే కొంద‌రు ఈ విష‌యంలో ధోనికి స‌పోర్ట్ ఇస్తున్న‌ప్ప‌టికీ మ‌రి కొంద‌రు విచ‌క్ష‌ణార‌హితంగా సోష‌ల్ మీడియాలో నీచ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ నెటిజ‌న్ చెన్నై ఓడినందుకు ధోని కూతురిని రేప్ చేస్తానంటూ కామెంట్ చేశాడు. ఏదేమైన ఈ సీజ‌న్ ధోనితో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఓ మ‌చ్చ‌లా మిగిలిపోతుంది.