`తల-పెద్ద తల` (రైనా-ధోనీ) రిటైర్మెంట్ తో భారత క్రికెట్ అభిమానులు దుఖంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇరువురు ఒకేసారి రిటైర్మైంట్ ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇద్దరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఇది నిజమా? అబద్దమా? అన్న సందిగ్ధంలో ఇప్పటికీ పలువురు అభిమానులు ఉన్నారు. అభిమానులంతా ఆ ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లకు కన్నీటి ద్వారా విడ్కోలు పలికారు. ప్రపంచ వేదికలపై ఇద్దరి స్మృతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కన్నీటి పర్యంతమయ్యారు.
తాజాగా రిటైర్మెంట్ విషయంలో రైనా తొలిసారి స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఐపీఎల్ 2020 కోసం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం కోసం రైనా పియూష్ చావ్లా, దీపక్ చాహార్, కరణ్ శర్మ చార్టెడ్ ప్లేన్ లో బయలు దేరి ధోనీ కోసం రాంచీ వెళ్లారుట. అక్కడ నుంచి నేరుగా అంతా చెన్నైకి చేరుకున్నారుట. అప్పటికే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు రైనాకు తెలుసని అన్నాడు. అప్పుడే తాను కూడా రిటైర్మంట్ ఇచ్చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడుట. ఈ విషయాన్ని ధోనికి చెప్పగానే కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికి చివరికి ఒప్పుకున్నాడుట. ఆ తర్వాతే ఇద్దరు సంయుక్తంగా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించినట్లు రైనా తెలిపాడు.
అనంతరం ఇద్దరు కౌగిలించుకుని చాలా సేపు కన్నీరు మున్నీరైనట్లు తెలిపాడు. ప్రపంచ వేదికలపై తమ గెలుపోటములు గుర్తు చేసుకున్నప్పుడు కన్నీళ్లు ఉబికి వచ్చేవని రైనా అన్నాడు. ఆ ఘటన నుంచి బయటకు వచ్చిన తర్వాత జట్టు సభ్యులంతా అక్కడే కూర్చొని కెరీర్ గురించి మాట్లాడుకున్నట్లు రైనా చెప్పుకొచ్చాడు. క్రికెట్ జీవితం..క్రికెట్ తర్వాత జీవితం చాలా మార్పులు తీసుకొస్తుందని రైనా తెలిపాడు.