ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ … ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ ఈ ఐపీఎల్. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రజాదరణ కలిగిన లీగ్ కూడా ఇదే. పాక్ మినహా అన్ని దేశాల స్టార్ ఆటగాళ్లు ఈ రిచ్ లీగ్ లో పాల్గొంటారు. ఇక ఇండియన్ స్టార్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ఐపీఎల్ లో ఆడితే ఆ ఆటగాళ్లకు కోట్లు వచ్చి పడతాయి. అలా ఇప్పటివరకు ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి రూ.150 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ లో రికార్డు నెలకొల్పనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లలో ఇంతగా వేతనం తీసుకున్న ఆటగాడు లేడు.
మొత్తం 13 సీజన్లు కలుపుకుని ఆయన అందరికంటే అధికంగా రూ.137 కోట్లను వేతనంగా తీసుకున్నాడు. ఆయనను చెన్నై టీమ్ 2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు కొనుక్కుని ఆడించింది. అనంతరం మరో మూడేళ్ల పాటు ఆయన రూ.8.28 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2014, 2015 సీజన్ లలో ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2018 ఐపీఎల్ లో ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు తీసుకున్నాడు. తదుపరి సీజన్లోనూ ఆయన రూ.15 కోట్లు తీసుకోనున్నాడు. ఈ సీజన్ లో ఆడితే ఆయన తీసుకున్న మొత్తం వేతనం రూ.150 కోట్లు అవుతుంది.
అంతేగాక, ఐపీఎల్ ద్వారా ఇతరత్రా మార్గాల్లో వచ్చిన ఆయన ఆదాయాన్ని కూడా లెక్కబెడితే మరో రూ.50 కోట్లతో ఆయన తీసుకున్న మొత్తం రూ.200 కోట్లు దాటవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోనీ తర్వాత అత్యధిక వేతనం తీసుకున్న ఆటగాళ్లుగా రూ.131 కోట్లతో రోహిత్‌శర్మ, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లీ ఉన్నారు.