29 ఏళ్ళ వ‌య‌స్సులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ఆల్‌రౌండ‌ర్.. ల‌వ‌ర్ కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌!

ఒక దేశం త‌ర‌పున మ్యాచ్ ఆడే అవ‌కాశం రావ‌డం ఎంతో అదృష్టం అని చెప్ప‌వ‌చ్చు. ఎంతో ప్ర‌తిభ ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ప్ర‌తిభ‌తో పాటు అదృష్టం రెండు జ‌తైతే ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్‌లో మ‌న‌మేంటో చూపించే ఛాన్స్ వ‌స్తుంది. అయితే న్యూజిలాండ్ సీనియర్ ఆల్‌రౌండ‌ర్ చిన్న వ‌య‌స్సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆల్‌రౌండ్‌ర్ గా కివీస్ కు ఎన్నో సేవ‌ల‌ను అందించాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాద‌గా , ఈ మ్యాచ్‌ని క్రికెట్ ప్రేమికులు ఎవ‌రు కూడా మ‌ర‌చిపోరు.

త‌న బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ఎంత‌గానో అలరించిన ఆండ‌ర్స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోరె అండర్సన్ 93 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2,277 పరుగులు చేసి.. 90 వికెట్లు పడగొట్టాడు. ఎన్నో రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న కోరీ తాజాగా షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. రెండేళ్ళుగా గాయాలు అత‌నిని వేధిస్తున్న నేప‌థ్యంలో న్యూజిలాండ్ త‌ర‌పున ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

కేవ‌లం 29 ఏళ్ళ వ‌య‌స్సులో ఆండ‌ర్స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం ప్ర‌తి ఒక్కరిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తుంది. అయితే అత‌ను ప్రైవేట్ టీ20 లీగ్స్‌పై దృష్టి సారించేందుకు ఈ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల త‌ర‌పున ఆడిన అనుభ‌వం ఉన్న ఆండ‌ర్స‌న్ ప్రైవేట్ లీగ్స్‌లో స‌త్తా చాట‌తాడ‌ని ఆశాభావంతో ఉన్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో అమెరికాలోని యుఎస్‌ఏ మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడేలా మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు ఆండ‌ర్స‌న్.ఈ స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ చేయ‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌ట‌. త‌న ప్రేయ‌సి ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉండ‌గా, ఆమెతో గ‌డుపుతూ ఈ లీగ్‌ల‌లో ఆడొచ్చు అని మ‌నోడు భావించిన‌ట్టు స‌మాచారం.