కరోనా వలన లాక్‌డౌన్ ప్రకటించడంతో దాదాపు 8 నెలల పాటు క్రికెటర్స్ బ్యాట్, బాల్‌ని పక్కన పడేసి ఇంట్లోనే సరదాగా గడిపారు. ఐపీఎల్ ద్వారా తిరిగి గ్రౌండ్‌లోకి పెట్టి ఇక వరుస సిరీస్‌లతో బిజీగా మారారు. ఇండియా విషయానికి వస్తే లాక్‌డౌన్ తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డే, టీ 20, టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్న భారత్ వన్డే సిరీస్ కోల్పోయి టీ 20 సిరీస్ దక్కించుకుంది. రేపటి నుండి జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో గెలుపొంది ఈ కప్ తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.
ఆస్ట్రేలియాతో గురువారం నుండి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ కాగా, ఇందులో ఇరువురు ప్లేయర్స్ పింక్ బాల్‌తో మ్యాచ్ ఆడతారు. ఆస్ట్రేలియా గడ్డపై తమ సత్తా చాటాలని భావిస్తున్న టీమిండియాకు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం బీసీసీఐ తమ ట్విట్టర్ ద్వారా 11 మంది ప్లేయర్స్ లిస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో స్థానం దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, పృథ్వి షా ఓపెనర్స్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జడేజా అందుబాటులో లేకపోవడంతో ఒకే ఒక్క స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో బరిలో దిగనున్నాడు. ఇక వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహాకు అవకాశం దక్కింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్దసెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురైంది. అతనికి తుది జట్టులో అవకాశం కల్పించలేదు. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో పుజారా, కోహ్లి, రహానే ఆడనుండగా, ముగ్గురు పేస్‌బౌలర్లు ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రాలు పదునైన బంతులతో ఆసీస్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
డేనైట్ టెస్ట్‌కు టీమిండియా: పృథ్వి షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా