ఐపీఎల్ అంటే మస్త్ మజా ఇచ్చే గేమ్. సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా మారిపోయింది. వేసవిలో జరగాల్సిన లీగ్ కరోనా కారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగింది. అది కూడా మన దేశంలో కాదు. ప్రేక్షుకుల సందడి లేనే లేదు. కానీ తప్పదు..ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకో ఆప్షన్ కనిపించలేదు. ఇక ఈ సీజన్‌లో కూడా ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ మళ్లీ టైటిల్ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందని తేల్చి చెప్పారు బిసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. అందుకు ఎంతో సమయం లేదు. మరో ఐదు నెలల్లోనే పొట్టి క్రికెట్ మజా మరో క్రీడాభిమానులు రుచి చూడవచ్చు.
సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నెక్ట్స్ సీజన్‌కు సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త ఫ్రాంచైజీ రాబోతుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. కొత్త ఫ్రాంచైజీ రాకతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీలకు సంకేతాలు కూడా అందాయట. సాధారణంగా ప్రతీ సీజన్ వేలం డిసెంబర్‌లోనే జరుగుతుంది, కానీ ఈ సారి మాత్రం వచ్చే ఏడాది జనవరిలో వేలం జరగనుందని సమాచారం.
ఇక కొత్తగా వచ్చే ఫ్రాంచైజీ కోసం మొబైల్ అప్లికేషన్ కంపెనీ ‘బైజుస్’ తో కలిసి మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన హాజరు కావడం కూడా ఈ చర్చకు మరింత బలానిచ్చింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్‌కు మోహన్ లాల్ అటెండ్ అయ్యారు. వాస్తవానికి ఈ సీజన్‌లో ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే వచ్చారని, బైజుస్‌తో కలిసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా దాఖలు చేశారని క్రికెట్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ విషయంపై అటు బిసీసీఐ నుంచి కానీ మోహన్ లాల్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొత్తగా రాబోయే 9వ జట్టు అహ్మదాబాద్ లేదా కేరళ బేస్డ్‌గా ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి కొత్త జట్టు వస్తే మ్యాచుల సంఖ్య పెరుగుతోంది. చాలా లెక్కలు మారిపోతాయ్. క్రికెట్ ప్రేమికులకు మరింత మజా దొరుకతుంది. మరి మోహన్ లాల్ దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో వేచి చూడాలి.