జగన్ పై ప్రేమ తగ్గలేదు, సాయి రెడ్డి సంచలన కామెంట్స్..!

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయసాయి రెడ్డి.. తన సరికొత్త రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ‘ఎ-కన్వెన్షన్’ వేదికగా తన కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించగా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై విజయసాయిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ను తానుగా వదిలి వెళ్లిపోలేదని, ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు సృష్టించిన పరిస్థితుల వల్లే బయటకు రావలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఉచ్చులో ఆయన చిక్కుకున్నారని, తనను పదే పదే అవమానించి, నొప్పించేలా వ్యవహరించడంతోనే నిగర్విగా ఆత్మగౌరవం కోసం వైసిపి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను స్థాపించబోయే కొత్త పార్టీ కేవలం రెండు కులాలు లేదా రెండు కుటుంబాల ప్రయోజనాల కోసం పుట్టింది కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు, అన్ని మతాలకు సమానంగా న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ మూడో ప్రత్యామ్నాయ శక్తీగా పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు దక్కాల్సిన హక్కులను నిరంతరం కాపాడటానికి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పారదర్శకమైన పాలన అందించడానికే ఈ వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నూతన పార్టీలో యువతకు, కొత్తగా వచ్చే నాయకులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని, ఎవరికీ అవమానాలు జరగకుండా ప్రతి ఒక్కరికీ సముచితమైన స్థానం, ఆత్మగౌరవం లభిస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పటికే హిందూత్వ అనుకూల నేత సుమతీరెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేష్ వంటి పలువురు ప్రముఖులు తనతో చేతులు కలిపారని, రాబోయే రోజుల్లో అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున నేతలు పార్టీలోకి రాబోతున్నారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.