54 మంది అధికారుల లిస్ట్ రెడీ చేసిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల విధుల్లో కొందరు పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార కూటమికి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులే స్వయంగా రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే అంశంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు వైసీపీ లీగల్ సెల్ సర్వం సిద్ధం చేసింది.

ఈ పిటిషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటు మొత్తం 54 మంది పోలీస్ అధికారుల తీరును వైసీపీ గుర్తించింది. నామినేషన్లు వేయకుండా వైసీపీ అభ్యర్థులను భౌతికంగా అడ్డుకోవడం, క్షేత్రస్థాయిలో అల్లర్లను ప్రోత్సహించడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పరోక్షంగా సహకరించడం వంటి తీవ్రమైన ఆరోపణలను ఈ అధికారులపై మోపనున్నారు. పలు చోట్ల ప్రత్యర్థులు దాడులకు తెగబడుతూ హింసను సృష్టిస్తున్నా.. పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర పోషించారంటూ ఆధారాలతో సహా అత్యున్నత న్యాయస్థానానికి వివరించాలని వైసీపీ నిర్ణయించింది.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నామినేషన్ల కేంద్రాల వద్ద జరిగిన ఘర్షణలు, పోలీసుల అక్రమాలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను వైసీపీ ఇప్పటికే క్షుణ్ణంగా సేకరించింది. ఈ డిజిటల్ ఆధారాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా సమర్పించి నివేదించనున్నారు. ఇప్పటికే 19 మున్సిపాలిటీల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు నేరుగా పోలీసులనే టార్గెట్ చేస్తూ లీగల్ బ్యాటిల్‌కు దిగుతుండటంతో ఏపీ పోలీస్ సర్కిల్స్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.