కూటమిలో మహిళా రిజర్వేషనా.. లేక నేతల ఇళ్లకే పరిమితమా..?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని అధికార కూటమి ఘనంగా చెప్తోంది. క్షేత్రస్థాయిలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందనే మాట వాస్తవమే అయినప్పటికీ, కేటాయించిన స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను గమనిస్తే మాత్రం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అంతా వారసత్వ మాయాజాలమే కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. సాధికారత పేరుతో సామాన్య మహిళా కార్యకర్తలకు కాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లోని మహిళలకే సీట్లు దక్కుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల దాఖలైన నామినేషన్ల సరళిని పరిశీలిస్తే ప్రముఖ రాజకీయ కుటుంబాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం నుంచే ఏకంగా మూడు నామినేషన్లు దాఖలు కావడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి భార్య మండిపల్లి హరిత రెడ్డి, అలాగే ఆయన తల్లి మండిపల్లి సుప్రజమ్మ ఇద్దరూ ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఉత్తరాంధ్రలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి భార్య చింతకాయల పద్మావతి టీడీపీ తరఫున బరిలో నిలిచారు.

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీనియర్ నేతలు తమ వారసురాళ్లను రంగంలోకి దించారు. జనసేన సీనియర్ నేత అవనాపు విక్రమ్ భార్య అవనాపు లావణ్య కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా పోటీ పడుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ మరియు గోదావరి జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఎమ్మెల్యేల కుమార్తెలు, భార్యల పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ కూడా ఏలూరు జెడ్పీ పీఠాన్ని ఆశిస్తూ నామినేషన్ వేసి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

కూటమి ప్రభుత్వం చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెంచి హిస్టరీ క్రియేట్ చేశామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఫలాలు మాత్రం సొంత పార్టీ నేతల ఇళ్లకే పరిమితం అవుతున్నాయనేది నగ్నసత్యం. పార్టీ జెండా మోసి, ఏళ్ల తరబడి ప్రజాసేవలో ఉంటూ ఆర్థిక బలం లేని సాధారణ మహిళా కార్యకర్తలకు ఈ రిజర్వేషన్ల వల్ల ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదనే నిరాశ వ్యక్తమవుతోంది.

సింహభాగం టికెట్లు ఇలా భార్యలు, కుమార్తెలు, తల్లులకే కేటాయించడం వల్ల.. రిజర్వేషన్లు మార్చినా కూడా పరోక్షంగా పదవుల పెత్తనం మళ్లీ సదరు మగ నేతల చేతుల్లోనే ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు గుర్రాల సమీకరణాలు, సొంత వర్గాన్ని కాపాడుకునే వ్యూహంతోనే అధిష్టానాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, ఇది ఒక రకంగా నిజమైన మహిళా సాధికారత స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందనే విమర్శ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.