నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసి, పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అంతర్గత ప్రాధాన్యతలపై తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, బీజేపీ నేత వంశీధర్ రెడ్డి, జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ వంటి హేమాహేమీలు ఒకే చోట చేరడం వెనుక అసలు కారణం క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భేటీ తర్వాత కూటమి మధ్య విభేదాలు ఉన్నాయనేది కేవలం ‘ఫేక్ ప్రచారం’ అని నేతలు పైకి కొట్టిపారేస్తున్నప్పటికీ.. అసలు ఆ ప్రచారంలో నిజం ఉంది కాబట్టే ఇంతమంది అగ్ర నేతలు అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చిందనేది నెల్లూరు అంతటా వినిపిస్తున్న బహిరంగ రహస్యం. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక కూటమి నేతల మధ్య తీవ్ర దూరాన్ని పెంచింది. ముఖ్యంగా జనసేన, బీజేపీ ఆశించిన కొన్ని కీలకమైన డివిజన్లను తెలుగుదేశం పార్టీ తన ఖాతాలోనే ఉంచుకోవడంతో ఆయా పార్టీల స్థానిక కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.
రూరల్ పరిధిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గానికి, నెల్లూరు సిటీ పరిధిలో మంత్రి నారాయణ వర్గానికి మధ్య కూడా కొన్ని డివిజన్ల సరిహద్దులు, అభ్యర్థుల కేటాయింపుపై అంతర్గత శీతల సమరం నడుస్తోంది. దీనికి తోడు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్‌ను ఖరారు చేసిన విధానంపై కూడా కొందరు సీనియర్ కార్పొరేటర్లు అలిగినట్లు సమాచారం. బయటకు అంతా సవ్యంగానే ఉందని చూపిస్తున్నా, లోలోపల అసమ్మతి రాగాల వల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని గ్రహించినందుకే ఈ డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ పెట్టారని స్పష్టమవుతోంది.
ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకున్న వేళ అసమ్మతి నేతలు లేదా సొంత పార్టీల తిరుగుబాటుదారులు గనుక గట్టిగా పనిచేయకపోతే అది మేయర్ పీఠంపై ప్రభావం చూపుతుందని ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి నివాస వేదికగా జనసేన నేత అజయ్, బీజేపీ నేత వంశీధర్ రెడ్డిలను పిలిపించి, ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగకుండా కేడర్‌ను లైన్లో పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. నాయకులు మీడియా ముందుకు వచ్చి “మా మధ్య అంతా బాగుంది.. ఇవన్నీ విపక్షాల అభూతకల్పనలు” అని ఎంత కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా.. నెల్లూరు కూటమి గూటిలో అంతర్గత కుమ్ములాటలు ముమ్మాటికీ నిజమేనని, ఈ అత్యవసర పంచాయితీయే అందుకు సజీవ సాక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.