కూటమిలో రేగిన రెబల్స్ కుంపటి.. ఎమ్మెల్యేలే దింపుతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి ఎన్డీయే కూటమిలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి ధర్మాన్ని పాటించాలని, పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా మారింది. స్థానిక ఎమ్మెల్యేలు తమ సొంత వర్గాలకు, అనుకూలురకు బీ-ఫారాలు ఇప్పించుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీనియర్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ‘రెబల్స్’గా నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యేల సొంత నిర్ణయాల చలవ వల్లే ఈ స్థాయిలో తిరుగుబాట్లు వచ్చాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలన్నింటిలోనూ ఈ రెబల్స్ సెగ తీవ్రంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో పార్టీ కోసం జైలుకు వెళ్లిన సీనియర్ మహిళా నేతను కాదని ఎమ్మెల్యే ఆశీస్సులతో మరొకరు బరిలోకి దిగగా, చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేసులు ఎదుర్కొన్న మరో నేత భార్యకు పోటీగా ఏకంగా ఒక ఎన్‌ఆర్‌ఐని ఎమ్మెల్యే రంగంలోకి దించారు. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి కుమార్తె, మాజీ ఎమ్మెల్యే పోటాపోటీగా నామినేషన్లు వేయగా, చిత్తూరులో ఒకే స్థానానికి నలుగురు సీనియర్లు పోటీ పడుతున్నారు.

ఇక ఏలూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో సైతం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు నామినేషన్లు వేసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యేలు వీటిని సర్దుబాటు చేయలేక చేతులెత్తేశారు. ఈ తాజా రాజకీయ పరిణామాలు మరియు సీట్ల గందరగోళంపై ఎన్డీయే కూటమి అగ్రనేతలు తక్షణమే స్పందించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడితో వేర్వేరుగా అత్యవసర భేటీలు జరిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాట్లు, రెబల్స్ సమస్యపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ధర్మానికి ఎక్కడా భంగం కలగకుండా వంద శాతం ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కూటమి పెద్దలు ఒక కీలక వ్యూహాన్ని ఖరారు చేశారు. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న నేపథ్యంలో, రెబల్స్ ఉన్న ప్రతి చోటా వారిని బుజ్జగించే బాధ్యతను ఎన్డీయే సమన్వయ కమిటీకి అప్పగించారు. తిరుగుబాటు అభ్యర్థులతో మాట్లాడి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసేలా ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేయనున్నాయి. అధిష్ఠానం తీసుకున్న ఈ బుజ్జగింపుల వ్యూహం ఎంతవరకు ఫలించి కూటమిలో ఈ రెబల్స్ కుంపటి చల్లారుస్తుందో చూడాలి.