విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయి రాజకీయాలపై విస్మయపరిచే సమీకరణాలను తెరపైకి తెచ్చాయి. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, గత ఐదేళ్లు అమరావతిని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ పెద్దగా డబ్బులు పంపిణీ చేయకుండా, పక్కా ప్రచార వ్యూహాలు లేకుండానే బరిలోకి దిగింది. అయినా సరే, నగరంలో ఫ్యాన్ గుర్తుకు 1,35,056 ఓట్ల భారీ పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, అమరావతి హక్కుల కోసం నిరంతరం గళమెత్తిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 12,657 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. ఈ భిన్నమైన గణాంకాలను విశ్లేషిస్తే, సామాన్య ఓటర్లకు అమరావతి సెంటిమెంట్‌పై పెద్దగా ఆసక్తి లేదని, కేవలం సెంటిమెంట్‌ను మాత్రమే నమ్ముకుంటే ప్రజాదరణ లభించదని స్పష్టమవుతోంది. ప్రజల అభిప్రాయానికి కేవలం ఎన్నికల గెలుపోటములు మాత్రమే ఎప్పుడూ కొలమానం కావు.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల మధ్యే పోటీని కేంద్రీకరిస్తారు. క్షేత్రస్థాయిలో ఒక బలమైన క్యాడర్ బలం, పార్టీ యంత్రాంగం లేకపోవడంతోనే ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఆయనకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. అయితే, ఐదేళ్ల పాటు రాజధానిని నిర్లక్ష్యం చేసినా వైఎస్సార్సీపీకి అంత భారీ స్థాయిలో ఓట్లు రావడం చూస్తుంటే.. బెజవాడ సామాన్య ఓటర్లలో అమరావతి అనే అంశంపై పెద్దగా ఆశక్తి లేదా అనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రజలకే ఆసక్తి లేని ఒక అంశంపై ప్రభుత్వం అనవసరంగా ఎక్కువ దృష్టి పెడుతోందా అనే అనుమానాలు కూడా ఈ తీర్పు ద్వారా వ్యక్తమవుతున్నాయి.
ఈ తాజా ఫలితాల సరళిని బట్టి చూస్తే, ప్రాంతీయ సెంటిమెంట్ల కంటే ప్రజలు వాస్తవ అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. జగన్ మావిగన్ అని ప్రకటించినా ఆయన ఓటు బ్యాంక్ కోల్పోలేదు. కాబట్టి అమరావతి లాంటి ఒకే ప్రాంతపు వివాదాస్పద అంశాలపై ప్రభుత్వం సమయాన్ని వృధా చేయడం కంటే.. రాష్ట్ర సమగ్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ‘పోలవరం ప్రాజెక్టు’ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసి, ఆ పక్కా అభివృద్ధి క్రెడిట్‌తో ఎన్నికలకు వెళితే ఏ ప్రభుత్వానికైనా మరింత మెరుగైన రాజకీయ ఫలితాలు వస్తాయి.