పాము పడగలా సుమారు 60 అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్మిన నీరు ఫౌంటెన్‌లా జనాన్ని ఆకట్టుకుంది. చూస్తూ ఉండలేకపోయారు. సెల్ఫీలు, వీడియోలతో సరదా తీర్చుకున్నారు. నిజానికి- అది మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడిపూర్ వద్ద నాగర్ కర్నూలు- కల్వకుర్తి ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకయింది.
దీనితో ఒక్కసారిగా గంగమ్మ పైకి విరజిమ్ముతూ సుమారు 50 నుంచి 60 అడుగుల మేర నీళ్లు పైకి ఎగిసిపడ్డాయి. ఎల్లూర్ నుంచి కల్వకుర్తికి భగీరథ నీరు తరలించే ప్రధాన పైప్‌లైన్ లీక్ కావడంతో అధికారులు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ మార్గన వెళ్తున్న వాహనదారులు దీన్ని చూడటానికి ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు. వీడియోలు తీసి, యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.