నిత్యా మీనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. తెలుగులోనే కాక మలయాళం, తమిళం, కన్నడ భాషలలో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. ఈమె 1988లో కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. 1998లో ”ద మంకీ హు న్యూ టూ మచ్” సినిమాలో టబు చెల్లెలుగా, బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యింది.
17 సంవత్సరాల వయసులో 2006లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె అసలు ఊహించలేదు ఒక మంచి పాత్రికేయురాలు కావాలనుకుంది. తర్వాత ఆమెకు సినీ రంగంపై ఇష్టం పెరగడంతో పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది.
అక్కడ బి.వి. నందిని రెడ్డి పరిచయం అయ్యి, ఈమెను నటన వైపు ప్రోత్సహించింది. ఆ తరువాత బి. వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రం మంచి విజయం సాధించి ఈమె ఉత్తమ నటీమణీ గా నంది పురస్కారం అందుకుంది. ఈమెకు వన్యప్రాణి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈమెకు వివిధ భాషలు నేర్చుకొని మాట్లాడడం అంటే చాలా ఆసక్తి.
ఆ తర్వాత నటించిన సెగ,180 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించక లేదు. ఆ తర్వాత నితిన్ తో నటించిన ఇష్క్ సినిమా మంచి విజయం సాధించి గుర్తింపు తీసుకొచ్చింది. మళ్లీ నితిన్ తో నటించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం విజయం కాగా ఈమె పాపులర్ నటిగా గుర్తింపు పొందింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాలలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత తమిళం, మలయాళం కన్నడ భాషలలో అవకాశాలు వచ్చాయి. ఈమె మూడు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, రెండు నంది అవార్డులు గెలుచుకుంది. ఓసారి మీడియా ఇంటర్వ్యూలో సెలబ్రిటీలను దొంగతనంగా ఫోటోలు తీయడం, కాస్త అసభ్యకరంగా మాట్లాడడం తనకు నచ్చదని, కాస్త క్లోజ్ గా ఉంటే ఒకరకంగా లేకపోతే పొగరు అని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంటారు. ఇలాంటివి తనకు నచ్చవని పేర్కొంది.