సిల్క్ స్మిత ప్రముఖ దక్షిణాది నటి. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. 1960లో ఏలూరులో జన్మించింది. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 200 కు పైగా చిత్రాలలో నటించడం జరిగింది. ఈమె అధికంగా గ్లామర్ తో కూడిన శృంగార, వగలమాడి పాత్రలు పోషించింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈమె నాలుగవ తరగతి వరకు చదువుకుంది.
సినిమాలలో నటించాలి అనే ఆసక్తితో అనేక ప్రయత్నాలు చేసి చివరికి తమిళంలో 1979లో వండి చక్రం అనే సినిమాలో నటించి తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. అనేక సినిమాలలో ప్రత్యేక గీతాలు,శృంగార నృత్యాలు ఆమెకు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. తెలుగులో అయితే బావలు సయ్య మరదలు సయ్య పాట విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఎక్కువగా చిత్రాలలో ఆమె నర్తకి గా, ఇతరులను వలలో వేసుకునే పాత్రలలో నటించి కుర్ర కారును ఉర్రూతలూగించే నృత్యాలతో కామోద్దీపము కలిగించే దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1981లో వచ్చిన సీతాకోక చిలక ద్వారా తన నటనను కూడా నిరూపించుకుంది. ఇలా సాఫీగా, బిజీగా దూసుకుపోతున్న సిల్క్ స్మిత జీవితం ఒక్కసారిగా కష్టాలను చవిచూసింది.
ఒక డాక్టర్ తో పరిచయం ఏర్పడి అతడే ఈమె డేట్స్, ఫైనాన్షియల్ బాధ్యతలను చూసుకునేవాడు. అతడు బాగా నమ్మించి ఆస్తులన్నీ తనపై రాసుకున్నాడు. ఎవరు ఫోన్ చేసినా మేడం గారు లేరని, ఎవరినీ కలవనిచ్చేవాడు కాదు. తరువాత డాక్టర్ కుటుంబమంతా సిల్క్ స్మిత ఇంట్లోనే ఉంటూ హింసించే వారట.
తరువాత సినిమా అవకాశాలు తగ్గి, సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాక, సినిమాలో పనిచేసిన వారికి పేమెంట్ ఇవ్వాల్సి ఉండగా ఆ డాక్టర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న నగలు అమ్మి పేమెంట్లు ఇచ్చేసింది. డబ్బంతా ఖాళీ అయిపోయింది ఏమీ లేదంటూ తప్పుడు లెక్కలు చూపించి మోసం చేశాడు. సిల్క్ స్మిత కు వివాహం కూడా కాలేదు. కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక, నమ్మినవారు మోసం చేయడంతో 1996లో మద్రాసులోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.