పాన్‌ ఇండియా స్థాయిలో మరోసారి తెరపై సిల్క్‌ స్మిత జీవిత కథ!

గ్లామర్‌ డాల్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్‌స్మిత. అలనాటి స్టార్‌ హీరోలతో ఎన్నో ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించి.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వృత్తిపరంగానూ, వైవాహిక జీవితంలోనూ చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్‌ 23న ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. చివరకు వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్‌’ తెరకెక్కింది.

సిల్క్‌స్మితగా విద్యాబాలన్‌ నటించారు. ఇప్పుడు మరోసారి సిల్క్‌ జీవిత కథ తెరపై కనిపించనుంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జయరామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘సిల్క్‌ స్మిత.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సిల్క్‌ స్మిత జయంతిని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో చంద్రిక.. సేమ్‌ స్మితలాగే కనిపించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కు తోన్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రికా రవి ‘వీర సింహారెడ్డి’ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే…