కీర్తి రెడ్డి ఒక భారతీయ నటి. ఈమె తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నటించింది. కీర్తి రెడ్డి 2004లో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ను వివాహం చేసుకుంది. 2006లో కొన్ని మనస్పర్ధ కారణాలవల్ల వీరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
కీర్తి రెడ్డి 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ ‘గన్ షాట్’ సినిమాలో అలీ సరసన నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. 1998లో వచ్చిన తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా మొదటిగా ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది.
2000 సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ సరసన తేరా జాదు చల్ గయా అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ మహిళగా ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. హిందీలో రెండు మూడు సినిమాలు చేసి ఇక బాలీవుడ్ లో నటించడం మానేసింది. 2002లో ఆమె నటించిన ఏకైక కన్నడ చిత్రం సూపర్ స్టార్.
కీర్తి రెడ్డి 2004 లో వచ్చిన అర్జున్ సినిమాలో చివరగా నటించింది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. కీర్తి రెడ్డి తక్కువ సినిమాలు చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుమంత్ తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్ళిపోయింది.
కీర్తి రెడ్డి అమెరికాలో ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.