ఆర్. నారాయణమూర్తి తెలుగు సినీ నటుడుగా, దర్శకుడుగా అందరికీ సుపరిచితమే. ఈయన ఎక్కువగా విప్లవ ప్రధానమైన సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించడంలో బాగా ప్రసిద్ధి. ఇతను అవివాహితుడు. ఇతను ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లి చాలా కష్టాలు పడ్డాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయి.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నేరము శిక్ష సినిమాలో చిన్న పాత్ర అవకాశం ఇచ్చారు దాసరి. కానీ ఆ సినిమా వల్ల గుర్తింపు రాలేదు. సినిమా అవకాశాలు రాలేదు కానీ పేపర్లో తాను ఇంటర్మీడియట్ పాసయ్యాను అన్న విషయం తెలిసి చాలా సంతోషించాడు. దాసరి నారాయణరావు కూడా చదువు పూర్తి చేసుకున్నాక సినిమా రంగం వైపు వస్తే భవిష్యత్తు ఉంటుంది అనడంతో, మద్రాస్ నుండి తన ఊరికి వచ్చి బి.ఎ పూర్తి చేశాడు.
ఇతను కాలేజీలో చదివే రోజుల్లో ఎక్కువగా కమ్యూనిస్టు పుస్తకాలు చదివేవాడు. ఇక దాసరి గారి పరిచయమే ఇతని కెరీర్ ని మలుపు తిప్పింది. దాసరి దర్శకత్వం వహిస్తున్న నీడ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను ఆర్. నారాయణమూర్తికి ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో తన పాత్ర ద్వారా కరుణానిధి చేతుల మీదుగా వందరోజుల షీల్డ్ అందుకున్నాడు.
ఆ తర్వాత దాసరి నారాయణరావు, రామ నాయుడు వంటి ప్రముఖ దర్శకుల సినిమాలలో అనేక సహాయ పాత్రలలో నటించడం జరిగింది. తర్వాత నిర్మాతగా మారి అర్ధరాత్రి స్వతంత్రం సినిమాని నిర్మించడం జరిగింది. ఈయన కెరీర్లో చీమలదండు, ఎర్రసైన్యం, దండోరా సినిమాలు ది బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇలా కెరీర్లో తనదైన శైలిలో ముందుకు రాణిస్తున్న ఆర్. నారాయణమూర్తి ఆర్థిక స్తోమత బాగానే ఉన్న కార్లలో కాకుండా, దగ్గర్లో అయితే నడిచి వెళ్లడం, కాస్త దూరమైతే ఆటోలో వెళ్లడం జరుగుతుంది. దీనికి ఆయన ఆడంబర జీవితం కంటే.. సాధారణ జీవనం అంటేనే చాలా ఇష్టమట. తాను జీవితంలో ఎన్నో కష్టాలు పడడంతో.. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా సాధారణ జీవితమే గడపాలని అనుకునే వారట.
ఇక చివరగా ఈయన నిర్మించి నటించిన చిత్రం రైతన్న 2021లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా కథను తయారు చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.