ఎ. ఆర్. రెహమాన్ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

ఎ.ఆర్. రెహమాన్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత. ఇతని అసలు పేరు ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న ఇతను చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు.

ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్ లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. కుటుంబ బాధ్యత కోసం చదువును విడిచిపెట్టి జీవిత పాఠాలు నేర్చుకొని ముందుకు కొనసాగాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమాకు సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది. ఆ తరువాత వరుస అవకాశాలతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రాణించాడు. భారతదేశంలోనే గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఇతని తల్లి ప్రోత్సాహం ఎంతో దాగి ఉంది.

ఈయనకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి కుటుంబ బాధ్యత కోసం ఇంట్లోని సంగీత వాయిద్యా పరికరాలను అద్దెకు ఇస్తూ కుటుంబ పోషణ కొనసాగించేది. కొంతకాలానికి అద్దెకు తీసుకునేవారు తగ్గిపోవడంతో రెహమాన్ ను పూర్తిగా సంగీతంపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించడం జరిగింది.

రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతో పాటు, మేరీ మాత, మక్కా మసీదు చిత్రాలు కూడా ఉండేవి. భర్త మరణం తర్వాత 1989లో ఇస్లాం మతంలోకి మారడం జరిగింది. ఇక ఈయన దిలీప్ పేరును మార్చుకోవాలని కడప జిల్లాలోని దర్గాలో కరీముల్లా షా ఖాద్రిను సంప్రదించగా ఆయన అబ్దుల్ రహీం లేదా అబ్దుల్ రెహమాన్ గా పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుంది అని పేర్కొనడం జరిగింది.

రెహమాన్ పేరు నచ్చడంతో అప్పటినుండి ఈ పేరుతోనే పిలువబడుతున్నాడు. ఇక ఈయన కడప జిల్లా, నెల్లూరు జిల్లాలోని దర్గాలను తరచూ సందర్శిస్తుంటాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు సంగీత దర్శకునిగా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.