టీడీపీని అల్లరి చేద్దామనుకున్నారుగానీ, వైసీపీ స్థాయిని తగ్గించేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆయనకు తోడుగా నిలిచారు టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
అసలు విషయమేంటంటే, పదో తరగతి పరీక్షల రచ్చకు సంబంధించి,, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ఓ జూమ్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థులతో నారా లోకేష్ మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. సరే, ఈ జూమ్ మీటింగ్ వెనుక రాజకీయమేంటన్నది బహిరంగ రహస్యం.
రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయ్.. టీడీపీ టెక్నాలజీని వాడుకుని కూడా రాజకీయం చేయగలదు. చేసింది కూడా. అందులోకి వైసీపీ ఎందుకు దూరాలి.? కొడాలి నాని, వల్లభనేని వంశీ,టీడీపీ జూమ్ మీటింగులోకి చొరబడ్డారు. అబ్బే, మేం అక్రమంగా రాలేదు.. విద్యార్థులతోనే వచ్చాం.. అంటూ కొడాలి, వల్లభనేని వివరణ ఇచ్చుకున్నారు.
‘మా బంధువు అయిన ఓ విద్యార్థితోపాటే వచ్చాను..’ అంటున్నారు కొడాలి నాని. ఇదెక్కడి పంచాయితీ.? టడీపీని విమర్శించడానికి వైసీపీకి చాలా అవకాశాలున్నాయి. నానా తిట్లూ తిట్టేందుకు కొడాలి నానికి నోరుంది. జూమ్ మీటింగులోకి వెళ్ళి కొడాలి నాని ఏం చేద్దామనుకున్నారు.?
ఈ విషయంలో టీడీపీకి సహజంగానే జనం నుంచి సపోర్ట్ లభిస్తుంది. అధికార పార్టీ వైఫల్యం కారణంగానే ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్న విమర్శలున్నాయి. నిజానికి, ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతలు నోరు మెదపకూడదు. కానీ, రచ్చ చేయాలనుకుని భంగపడ్డారు. వెరసి, వైసీపీ పరువు బజార్న పడేశారు.