తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల పార్టీ త్వరలో మాయమవుతుందా.?

వైఎస్ షర్మిల తెలంగాణలో అట్టహాసంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగానికి చెందిన చాలామంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్టీపీ వెంట నడుస్తున్నారు. అయితే, కాలక్రమంలో ఒకరొకరు పార్టీని వీడుతోంటే, వైఎస్సార్టీపీ అధిష్టానంలో ఆందోళన షురూ అవుతోంది. తాజాగా వైటీపీ ముఖ్య నేత ఇందిరా శోభన్, ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీపై ఆమె విమర్శలేమీ చేయకపోవడం గమనార్హం. షర్మిలపైనా ఆమె ఎలాంటి కామెంట్స్ చేయలేదుగానీ, షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు తనకు అవకాశం కల్పించినందుకు. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో సరిగ్గా మాట్లాడగలిగే అతి కొద్దమంది నేతల్లో ఇందిరా శోభన్ కూడా ఒకరు. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి, షర్మిల పార్టీలో చేరారు కొన్నాళ్ళ క్రితం.

ఇప్పుడామె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, కొద్ది రోజుల క్రితం పార్టీకి సంబంధించి కీలక కమిటీలను షర్మిల ప్రకటించారు. ఆ తర్వాతే పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే జోరు కొనసాగితే, కొద్దిరోజుల్లోనే తెలంగాణలో షర్మిల పార్టీ గల్లంతయ్యే అవకాశముంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో షర్మిల హడావిడి చేస్తున్నారు. అయితే, ఆయా దీక్షలకు ఆమె ఆశించిన స్థాయిలో ప్రచారమూ రావడంలేదు, జనం నుంచి స్పందనా రావడంలేదు. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతోంది. బీజేపీ కూడా అనూహ్యంగా పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో షర్మిల పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో స్థానం వుంటుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒకవేళ తెలంగాణ రాజకీయాల్లో తనకు లాభం లేదనుకుంటే, షర్మిల తదుపరి రాజకీయ వ్యూహం ఎలా వుంటుంది.? ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడతారా.? వేచి చూడాల్సిందే.