ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు ఇన్నాళ్లుగా నడిచిన సైలెంట్ వార్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. వైఎస్ జగన్ నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసేశారు. ఈ పరిణామాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజల్లో న్యాయస్థానం పట్ల నమ్మకం పోయేలా జగన్ వ్యవహారం ఉందని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సో.. ఇప్పుడంతా ఫేస్ టూ ఫేస్ యుద్ధమే. జగన్ లేఖ రాసిన నేపథ్యంలో హైకోర్టు పాత కేసును బయటికి లాక్కొచ్చింది. కొన్ని నెలల క్రితం హైకోర్టు నుండి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీరాలు రావడంతో నొచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో కోర్టుల మీద వ్యాఖ్యలు చేశారు.
దాంతో హైకోర్టు వారందరికీ నోటీసులు జారీ చేసింది. కానీ ఎవరి మీదా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోర్టు నోటీసులు పంపుతోంది అని తెలియగానే వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీటింగ్ పెట్టి మరీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేసుల్లో ఇరుక్కున్నంత మాత్రాన కార్యకర్తను వదులుకోమని, వారికి అండగా ఉంటామని, అదే పార్టీకి, కార్యకర్తలకి ఉన్న స్నేహమని అన్నారు. ఆ మాటల ఫలితమే ఏమో కానీ ఎవ్వరి మీదా పోలీస్ చర్యలు లేవు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు న్యాయస్థానం చెప్పినా పోలీసులు ఇప్పటికీ విపరీత వ్యాఖ్యలు చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆగ్రహించింది.
వెంటనే కేసును సీబీఐకి అప్పగిస్తూ ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగి కుట్రకు బాధ్యులైనవారు ఎవరైనా, ఏ పదవిలో ఉన్నా ఉపేక్షించరాదని ఇటీవల జడ్జీల మీద ఆరోపణలు చేసినవారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వాన్ని సీబీఐకి సహకరించాలని ఆదేశించింది. దీంతో గతంలో నోటీసులు అందుకున్న వారు, తాజాగా కోర్టుల మీద తీవ్రంగా మాట్లాడిన వారిలో గుబులు మొదలైంది. అందరూ ఆనాడు విజయసాయిరెడ్డిగారు తమ సోషల్ మీడియా సోల్జర్లను కాపాడుకుంటామని అన్నారు కదా… నిజంగా కేసులను నుండి కాపాడతారా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి వారికి విజయసాయిరెడ్డిగారు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి.