MP Raghurama : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకి వైఎస్ జగన్ సర్కారు మరో షాక్ ఇవ్వబోతోందా.? ఇంకోసారి రఘురామ అరెస్టవడం తప్పదా.? రఘురామకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఏపీ సీఐడీ సమాయత్తమయ్యిందా.? అంటే ఔననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
గతంలో రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయిన విషయం విదితమే. అప్పట్లో తనను సీఐడీ కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారంటూ రఘురామ తరచూ ఆరోపిస్తున్నారు. ఆ కేసులో బెయిల్ తెచ్చుకోవడం, ఈ క్రమంలో రఘురామ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందడం.. ఇదంతా పెద్ద హంగామా అయ్యింది అప్పట్లో.
చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏపీసీఐడీ రఘురామకృష్ణరాజుకి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన పోలీసు అధికారులు, ఏ కేసులో నోటీసులు ఇచ్చారో మాత్రం మీడియాకి చెప్పేందుకు నిరాకరించారు. కాగా, నోటీసులు అందుకున్న రఘురామ, గతంలో నమోదైన కేసులకు సంబంధించి అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా ఏపీసీఐడీ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సంక్రాంతి పండగ ప్రాశస్త్యమేమిటో ముఖ్యమంత్రికీ, ఏపీ సీఐడీ చీఫ్‌కీ తెలియదేమోనని రఘురామ షరామామూలుగా వెటకారం చేశారు. అందుకున్నవి నోటీసులు మాత్రమే. నోటీసులకు రఘురామ ఎలాంటి సమాధానం చెబుతారన్నది వేరే చర్చ. ఆ తర్వాత ఏమవుతుందన్నది ఇప్పుడే ఊహించేసి, పెడార్ధాలు తీయడం వల్ల రచ్చ తప్ప ఉపయోగముండదు.
చాలాకాలం తర్వాత రఘురామ, సంక్రాంతి నేపథ్యంలో సొంతూరుకి వెళుతున్నారు. వైసీపీతో పంచాయితీ పెట్టుకున్నాక రఘురామ సొంత నియోజకవర్గం మొహం కూడా చేసేందుకు ఇష్టపడని విషయం విదితమే.