పాలక పార్టీ వైసీపీలో అసంతృప్తులు కొదవలేదు. నిత్యం ఎవరో ఒకరు అసహనాన్ని వెళ్లగక్కుతూ బయటపడుతున్నారు. నియోజకవర్గాల్లో పనులు జరగట్లేదనో, ఎంపీలు, మంత్రుల నుండి పోటీ, నిరాదరణ ఎదురవుతోందనో ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేది మాత్రం సపరేట్ సినారియో. ఆయనకు ఏకంగా పక్క జిల్లా మంత్రులతోనే విబేధాలు తలెత్తాయి. ఆయనే ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుండి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వైకాపా నుండి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మంత్రిగా కూడ పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. ఆయనకే ఇప్పుడు పార్టీలో పరిస్థితులు సంకటంగా మారాయి.
మానుగుంట మహీధర్ రెడ్డి రామాయపట్నం పోర్టు కొమ్మా చాలా కష్టపడ్డారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం హయాంలో గట్టిగా పోరాడి పోర్టుకు ఆమోద ముద్ర వేయించుకున్నారు. జగన్ సీఎం అవడంతో పోర్టుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించారు. మంత్రి పదవి దక్కకపోయినా పోర్టు సవ్యంగా పూర్తైతే చాలని అనుకున్నారు. కానీ సొంత పార్టీ నేతల నుండే ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు పోర్టు సంబంధింత పరిశ్రమలకు నెల్లూరు పరిధిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన ఆరోపించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టు ప్రయోజనాలను జిల్లా నుండి పక్కదారి పట్టనీయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారు. నేరుగా మంత్రులకే సంకేతాలిచ్చారు. అయితే ప్రకాశం జిల్లా మంత్రి, జగన్ కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి నుండి కూడ మహీధర్ రెడ్డికి సహకారం కరువైంది. దీంతో ఎమ్మెల్యే మీద సీత కన్ను పడింది. మామూలుగానే నియోజకవర్గంలో పనులు జరగట్లేదు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి కరువైంది. దానికి తోడు అరకొర పనులకు కూడ నిధులు రిలీజ్ చేయట్లేదట. చిన్న చిన్న పనులకు నిధులు ఉన్నప్పటికీ అధికారులు రిలీజ్ చేయట్లేదని టాక్. దీంతో మహీధర్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఇదంతా పోర్టు వివాదం ఫలితమేనని చెప్పుకుంటున్నారు.