పేకాట క్లబ్ కేసులో కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే 

YSRCP MLA Sridevi gets emotional
మూడు రోజుల క్రితం పెదకాకాని మండలం నంబూరులోని ఒక అపార్ట్మెంట్ నందు పేకాట శిబిరం నిర్వహిస్తున్న సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అతనితో పాటు భారీగా నగదును, పేకాట ఆడుతున్న ఇంకొంతమందిని అరెస్ట్ చేశారు.  పేకాట శిబిరం నడుపుతున్న సదరు వ్యక్తి వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రధాన అనుచరుడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  సదరు వ్యక్తి ఎమ్మెల్యేకు చాలా దగ్గరి వ్యక్తి అని, అతన్ని విడిపించడం కోసం ఎమ్మెల్యే నేరుగా పోలీసులకు ఫోన్ చేశారంనే ప్రచారం కూడా జరిగింది.  ఆ వ్యక్తి ఎమ్మెల్యే శ్రీదేవితో దిగిన ఫొటోలను, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫొటోలను ప్రచురించి పెద్ద రచ్చే చేశారు.  
 
మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రియల్ ఎస్టేట్ ఆఫీస్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బును వైసీపీ వ్యక్తులే పోలీసులకు రివీల్ చేశారనే వాదన కూడా ఉంది.  మొత్తానికి క్లబ్ వ్యవహారాన్ని ఎమ్మెల్యే శ్రీదేవికి బాగా కనెక్ట్ చేసేశారు.  రెండు రోజుల పాటు ఆ క్లబ్ నడుపుతున్నది ఎమ్మెల్యేనే అన్నట్టు చేసేశారు.  దీంతో విషయం హాట్ టాపిక్ అయింది.  ఎమ్మెల్యే శ్రీదేవి మీడియా ముందుకు రాక తప్పలేదు.నంబూరు పేకాట శిబిరానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేని అని కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేశారని, ఘటన జరిగింది తన నియోజకవర్గంలో కాదని పెదకాకాని మండలంలో అని అంటూ వాపోయారు. 
 
అసలు తనకు పేకాట క్లబ్ నిర్వహించాల్సిన అవసరం లేదని, ఒక సర్జరీ చేస్తే తనకు లక్ష రూపాయలు వస్తాయని, అలాంటి నాకు పేకాట ఆడించాల్సిన పని ఏముందని, తాను నిందితులను విడుదల చేయాలని పోలీసులకు ఫోన్ చేయలేదని, తనతో ఫోటో దిగినంత మాత్రాన తన అనుచరులు అయిపోతారా అంటూ కన్నీరు పెట్టుకున్నారు.    మహిళా ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనపై జరుగుతున్న రాజకీయ కుట్రపై అధిష్టానానికి పిర్యాధు చేస్తానని అన్నారు.  తనపై కుట్ర జరిగితే పోలీసులకు తెలపాలి కానీ అధిష్టానం వద్దకు వెళతానని ఎమ్మెల్యే అనడం చూస్తే సొంత పార్టీ వాళ్లే ఎవరైనా ఆమెను కావాలనే ఇరికిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.