రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. అప్పటివరకు శత్రువుల్లా ఉన్నవారు రాత్రికి రాత్రి మిత్రులైపోతారు. మిత్రులేమో శత్రువులవుతుంటారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటుంటారు. ఈ సినారియో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గాన్ని చూస్తే అర్థమైపోతుంది. పొన్నూరులో దశాబ్దాలుగా ధూళిపాళ్ల కుటుంబానిదే హవా. 1983 నుండి 2004 వరకు ఆ కుటుంబసభ్యులే ఎమ్మెల్యేలుగా ఉంటూ వచ్చారు. 83 నుండి 89 వరకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి టీడీపీ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక 94 నుండి 2014 వరకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.
మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని ఈ కుటుంబమే మోస్తూ వస్తోంది. అలాగే గెలుపు కూడ వెరీ వెంటే ఉంటూ వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ చేతిలో నరేంద్ర కుమార్ చౌదరికి ఓటమి తప్పలేదు. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య గెలుపొందారు. అప్పటి నుండి నరేంద్ర కుమార్ నియోజకవర్గాల్లో సైలెంట్ అయిపోయారు. అప్పటివరకు చక్రం తిప్పిన ఆయన మౌనం పాటించడం మొదలుపెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడ సైలెంట్ అయ్యాయి. ఈ వాతావరణంతో నరేంద్ర కుమార్ కూడ వైసీపీలో చేరతారని అనుకున్నారు.
ఎందుకంటే ఓడిన చాలామంది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారాల పరంగా ఎదురయ్యే కష్టాలు నుండి తప్పించుకోవడానికి అధికార పార్టీని ఆశ్రయిస్తున్నారు కాబట్టి. కానీ నరేంద్ర కుమార్ పార్టీ మారే పని లేకుండానే తనకు కావాల్సిన బెనిఫిట్స్ పొందుతున్నారట. ఎలాగంటే ఆయన నేరుగా గెలిచినా వైసీపీ ఎమ్మెల్యేతో సయోధ్య కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని అలా చేస్తే రాజకీయంగా మీకు ఎదురురావడం ఉండదని నరేంద్ర కుమార్ చెప్పారట. డీల్ బాగుందనుకున్న వైసీపీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటూ తన రాజకీయమేదో తాను సాఫీగా చేసుకుంటున్నారట. ఇదేమరి కలిసి ఉంటే కలదు సుఖం అంటే.