MLA Roja : త్వరలో, అతి త్వరలో.. అంటూ వైసీపీలో కొత్త మంత్రుల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయో ఈపాటికే లిస్టు ప్రిపేర్ అయిపోయిందనీ, ముఖ్య మంత్రి వద్దనే ఆ లిస్టు వుందనీ, దాదాపుగా ఆయా ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం తెలుసనీ అంటున్నారు.
సోషల్ మీడియాలో అయితే ఫలానా ఎమ్మెల్యే మంత్రి అవబోతున్నారనీ, ఫలానా శాఖ దక్కబోతోందని ఓ పెద్ద లిస్టు ప్రచారంలోకి వచ్చేసింది. ఇది వైసీపీ అధిష్టానమే లీక్ చేసిన లిస్టు అంటూ వెబ్ మీడియాలో కథనాలూ దర్శనమిస్తున్నాయి. ఆ లిస్టులో అతి ముఖ్యమైన పేరు వైసీపీ ఎమ్మెల్యే రోజాదేనట. అలాగని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
ఎందుకంటే, రోజా హోం మంత్రి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది గనుక. వాస్తవానికి తొలి సారి మంత్రి వర్గంలోనే వైఎస్ జగన్, రోజాకి హోం శాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అసలు రోజాకి ఏ మంత్రిత్వ శాఖ కూడా దక్కలేదు. ఆమెను బుజ్జగించేందుకు ఓ నామినేటెడ్ పదవి అప్పగించారు.. ఆ తర్వాత అది కూడా పీకేశారు.
మళ్ళీ ఇప్పుడ రోజా పేరు ‘మంత్రి’ కేటగిరీలో వినిపిస్తోంది. అయితే, ఈ విషయమై రోజా ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించడంలేదు. కానీ కొద్ది రోజుల ముందు చంద్రబాబు మీద పవర్ పంచ్‌లు పేల్చడంలో మునుపటి ఉత్సాహం ప్రదర్శించి, తాను మంత్రిని కాబోతున్నాననే సంకేతాల్ని పరోక్షంగా పంపించారామె.
రోజా గనుక హోం మంత్రి అయితే, ఆ కిక్కే వేరప్పా.. అంటూ వైసీపీ అభిమానులు చాలామంది భావిస్తున్నారు.