ప్రభుత్వం అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజలకు అండగా, రక్షణ నిలబడేదే. సమస్యలను ఎదుర్కొన్నప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత బయటపడుతుంది. కానీ సమస్యను గాలికొదిలేసి చేతులు దులుపుకుంటే ఏమవుతుంది.. అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడ అలాంటి పరిస్థితుల్లోకే వెళ్లేలా ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలు ఎంతగానో శ్రమించాయి. అందులో ఏపీ ప్రభుత్వం కూడ ఉంది. అత్యధిక సంఖ్యలో టెస్టులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది ప్రభుత్వం. కొన్ని లోటుపాట్లు జరిగినా చివరికి కరోనాను అదుపులోకి తీసుకురాగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తామంటోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం కోర్టు ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పూర్తి అధికారాలను ప్రయోగిస్తూ అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకెళుతున్నారు. ఆయన దూకుడు వైసీపీ నాయకులకు అస్సలు మింగుడు పడట్లేదు. ఎలాగైనా ఎన్నికలను వాయిదా వేయించాలని శతవిధాలా ప్రయత్నించి చివరికి దెబ్బతినడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. జగన్ అయితే బయటపడట్లేదు కానీ కోటరీ లీడర్లు మాత్రం ఓపెన్ అయిపోతున్నారు. ఎన్నికలు పెడితే కరోనా పెరిగిపోతుందని చెబుతున్న నాయకులు పంచాయతీ ఎన్నికల సమయంలో వచ్చే కరోనా కేసులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యత తీసుకోవాలని, మాకెలాంటి సంబంధం లేదని అంటున్నారు.
విజయసాయిరెడ్డి, సజ్జల ఇదే మాట అన్నారు. మాకెలాంటి సంబంధం లేదంటున్నారు. ఎన్నికలంటే ఈసీకి ప్రభుత్వం సహకరించాలి. ఇక్కడ సహకారం అంటే కరోనా వ్యాప్తికి గల అవకాశాలను నిరోధిస్తూ ఎన్నికలు జరపడమే. ఇప్పుడు దాన్నే మా బాధ్యత కాదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇది చేతులు ఎత్తేసే ధోరణే తప్ప ఇంకొకటి కాదు. సరే.. వైసీపీ నేతల వాదన మేరకే ఎన్నికల సమయంలో వ్యాప్తి చెందే కేసులకు నిమ్మగడ్డదే బాధ్యత అన్నప్పుడు ఇన్ని నెలలు రాష్ట్రంలో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అవి వైసీపీ ప్రభుత్వ పాలనలోనే కదా జరిగాయి. మరి వాటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని, తప్పు మాదే అంటూ ఒప్పుకుంటుందా ? లేదు కదా. అలా అడగడం కూడ సబబు కాదు. ఇప్పుడు వైసీపీ నేతలు రాబోయే కరోనా కేసులకు నిమ్మగడ్డదే బాద్యతని అనడం కూడ అలాంటిదే.