ఉన్నపళంగా కన్నా లక్ష్మీనారాయణను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి సోము వీర్రాజుకు ఆ పదవిని కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ చర్యతో బీజేపీ వైఖరి మీద పెద్ద పెద్ద అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. కన్నా మొదటి నుండి అధికార వైసీపీ మీద విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక్క అంబులెన్సుల ఏర్పాటును తప్ప దాదాపు మిగిలిన అన్ని నిర్ణయాలను తప్పుబడుతూనే వచ్చారు. తాజాగా ఆమరావతి విషయంలో కూడా మూడు రాజధానులకు కన్నా వ్యతిరేకంగా మాట్లాడటంతో వైసీపీకి మరింత చిర్రెత్తుకొచ్చింది. అందుకే తెర వెనుక స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కన్నా మీద బీజేపీకి పిర్యాధు చేసిందని టాక్.
ఒక దశలో విజయసాయిరెడ్డి కన్నా మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కన్నా చంద్రబాబు కోవర్ట్ అని, బీజేపీ మూడు రాజధానులకు అనుకూలం అయితే కన్నా మాత్రం టీడీపీ లైన్లో వెళ్లి వ్యతిరేకించారని, అధిష్టానం అయన మీద గుర్రుగా ఉందని, కన్నాది పచ్చ స్వామి భక్తి అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యల్లో అధిష్టానం కన్నా మీద చర్యలకు ఉపక్రమించిందనే అర్థం ధ్వనించింది. ఆయన అలా అన్న వారం రోజులకే లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుండి దింపివేయడం చూస్తే వైసీపీకి ఈ సంగతి ముందే తెలుసని స్పష్టమవుతోంది.
అంతేకాదు బీజేపీ అమరావతికి మద్దతుగా ఉందంటే దీక్షలు చేస్తున్న అమరావతి రైతుల్లో కొత్త ఆశలు, నమ్మకాలు పుట్టుకొచ్చి వారిలో పట్టుదల పెరిగే ప్రమాదం ఉండటంతో వైసీపీ కన్నా మీద పంతం పట్టి మరీ అధిస్టానంతో పక్కన పెట్టించిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన వైఖరి సైతం టీడీపీకి అనుకూలంగా ఉందనే అనుమానం వైసీపీలో ఉండటంతో బీజేపీ న్యాయకత్వం మీద కన్నా విషయం తేల్చాలనే పట్టు పట్టిందని, ఈ తంతు మొత్తం వైఎస్ జగన్ కనుసన్నల్లోనే జరిగిందని రాజకీయవర్గాల టాక్. మరి ఈ అనుమానాలు ఎంతవరకు నిజం, నిజంగానే బీజేపీ వైసీపీకి అనుకూలంగా పనిచేసిందా అనేది తెలియాలంటే వైసీపీ పట్ల, రాజధాని పట్ల కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి ఎలా ఉంటుందో చూస్తే సరిపోతుంది.