తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహం తారాస్థాయికి చేరుతోంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి ఓ ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలిచినా, ఉపయోగం లేదంటూ భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన వెటకారానికి వైసీపీ నుంచి ర్యాగింగ్ అత్యంత తీవ్ర స్థాయిలో జరుగుతోంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్.. బీజేపీ కనబడుట లేదు, విశాఖ రైల్వే జోన్.. బీజేపీ కనబడుట లేదు, టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. బీజేపీ కనబడుట లేదు, .. ఇలా నడుస్తోంది బీజేపీ మీద వైసీపీ ట్రోలింగ్ సోషల్ మీడియాలో. కెలికి మరీ తిట్టించుకోవడమంటే ఇదే మరి. ‘ఇంట్లో గ్యాస్ బండ చూసి, దణ్ణం పెట్టుకుని మరీ ఓటెయ్యడానికి వెళ్ళండి..’ అంటూ కొంత కాలం క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ వేసిన సెటైర్, ఇప్పుడు హాటు హాటుగా పేలుతోంది సోషల్ మీడియాలో.. అదీ బీజేపీకి వ్యతిరేకంగా.
బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో వంట గ్యాస్ ధరలు ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిందే. పెట్రో ధరల పెరుగుదల సంగతి సరే సరి. ఎలా చూసుకున్నా, భారతీయ జనతా పార్టీకి ఓటెయ్యడానికి ఒక్కటంటే ఒక్క కారణమూ కనిపించడంలేదన్న అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మాత్రం అన్ని పార్టీలకు చెందిన నెటిజన్లు దాదాపు ఒకే అభిప్రాయంతో వున్నారు.. రాజకీయాలతో సంబంధం లేని నెటిజన్లతో సహా. అన్నట్టు, జనసేన మద్దతుదారులైన నెటిజన్లు కూడా, ‘మా నాయకుడు బీజేపీకి మద్దతిస్తున్నాడు.. లేదంటే, మీకంటే ఎక్కువగా మేం ట్రోలింగ్ చేసేవాళ్ళం బీజేపీని’ అంటూ ట్వీట్లేస్తుండడం మరో ఆసక్తికరమైన అంశం. కాగా, కొందరు బీజేపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా, వైఎస్ జగన్ సర్కార్ మీదా, వైసీపీ పార్టీ మీదా ‘మతం’ కోణంలో జుగుప్సాకరమైన విమర్శలతో కూడిన కామెంట్లు పెడుతున్నారు.