కేసీఆర్ తొత్తుల్లా మారిన పోలీసులు: షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila's Serious Allegations On KCR Govt

YS Sharmila's Serious Allegations On KCR Govt

తెలంగాణలో నిరుద్యోగులెదుర్కొంటున్న సమస్యలపై మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల, కాస్సేపటి క్రితం దీక్ష విరమించారు. నిజానికి, తొలి రోజే షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, ఇంటివద్ద కూడా ఆమె దీక్ష కొనసాగింది. దీక్ష విరమించిన అనంతరం షర్మిల, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తొత్తుల్లా తెలంగాణ పోలీసులు మారిపోయారని విమర్శించారు షర్మిల. కేసీఆర్ డప్పు కొడుతోంటే, చేతులకు గాజులు తొడుక్కున్న విపక్షాలు ఆ డప్పులకు డాన్సులు చేస్తున్నాయంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు షర్మిల. ఓ మహిళనైన తాను కీలకమైన సమస్య మీద నిలబడితే, పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం తమ ఉద్యమాన్నీ నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారామె.

పోలీస్ అధికారి శ్రీధర్, మహిళలపై దాడులు చేశారని డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారామె. కాగా, తొలి రోజు దీక్ష అనంతరం షర్మిలను పోలీసులు, అరెస్టు చేసి ఆమెను ఇంటికి తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో షర్మిల చేతికి గాయమయ్యింది. అత్యంత హేయంగా పోలీసులు షర్మిల మీద దాడి చేశారంటూ ఆమె అభిమానులు ఆందోళన చేశారు. అయితే, ఇదంతా షర్మిల ఆడిన డ్రామా.. అంటూ అధికార పార్టీ లైట్ తీసుకుంది. నిజానికి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజీగా వున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. షర్మిల పార్టీని పూర్తగా లైట్ తీసుకున్నాయి. అయినాగానీ, షర్మిల మాత్రం తన దీక్షను కొనసాగించారు.. ఓ మోస్తరు స్థాయిలో అభిమానుల హంగామా మూడు రోజులపాటు సాగింది. తొలి బహిరంగ సభ ఖమ్మంలో ఎంత సక్సెస్ అయ్యిందో, తాజాగా చేపట్టిన మూడు రోజుల దీక్ష కూడా అంతే సక్సెస్ అయ్యిందని షర్మిల అభిమానులంటున్నారు.