వైఎస్ షర్మిల పాదయాత్ర: అధికారం ఆమెకు దక్కుతుందా.?

తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. నిర్మొహమాటంగా టీడీపీ అధినేత చంద్రబాబుని పక్కనెట్టేసింది తెలంగాణ. ఆంధ్ర – తెలంగాణ అన్న భావన తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. మరి, తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ షర్మిల ఎలా రాణించగలరు.? ఈ విషయమై షర్మిల చాలాసార్లు వివరణ ఇచ్చుకున్నారు. తనకు తెలంగాణతో ఎంతో అనుబంధం వుందని చెప్పుకున్నారు. తెలంగాణ ప్రజల వెతలు తనకు తెలుసన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలోనూ బోల్డంతమంది అభిమానులున్నారని అన్నారు. మరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణలో నిలదొక్కుకోలేకపోయింది.? అంటే, రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందికరమే అన్నది షర్మిల వాదన.

అందుకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైపోయింది. తెలంగాణ కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టుకొచ్చింది. అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాల్లేవని ఈ మధ్యనే షర్మిల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో క్లారిటీ వచ్చేసింది. త్వరలో షర్మిల తెలంగాణలో పాదయాత్ర కూడా చేయబోతున్నారు. దానికి ప్రజా ప్రస్థానం అనే పేరు కూడా పెట్టారు. చేవెళ్ళ నుంచి ప్రారంభమై, చేవెళ్ళలోనే ఈ పాదయాత్ర ముగుస్తుందట. ఏడాదికి పైగా ఈ పాదయాత్ర జరగనుంది. ప్రతిరోజూ 12 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారట షర్మిల. నిజానికి, షర్మిలకు పాదయాత్ర కొత్త కాదు. గతంలో ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దేశ రాజకీయాల్లో ఏ మహిళా చేయని సాహసం అది. ఇంకోసారి షర్మిల పాదయాత్ర చేయబోతున్నారంతే. ‘పాదయాత్రలతో అధికారం వచ్చేయదు..’ అని షర్మిల, తన రాజకీయ ప్రత్యర్థులపై కౌంటర్లు వేస్తున్న దరిమిలా, ఆమె తన పాదయాత్ర ద్వారా అధికారం దక్కించుకోగలరా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా త్వరలో షర్మిల పార్టీతో కలిసి పనిచేయనుందట.