వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ.!

Ys Sharmila To Announce YSRTP Soon

Ys Sharmila To Announce YSRTP Soon

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి తెరవెనుక వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు షర్మిల. అతి త్వరలో.. కొద్ది రోజుల్లోనే షర్మిల తన కొత్త పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ పేరుని వైఎస్సార్ తెలంగాణ పార్టీగా షర్మిల అండ్ టీమ్ రిజిస్టర్ చేసిందట. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీ పేరుని ఆమోదించిందంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఈ పేరుని గతంలోనే అంతా ఊహించారు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో వుంది.

నిజానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగాన్ని షర్మిల గతంలో డీల్ చేశారు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అదీ జగన్ నాయకత్వంలో.. అనగానే అప్పట్లో ఆంధ్రా పార్టీ.. అన్న భావన బలపడింది. అందుకే, తెలంగాణ కోసమే ప్రత్యేకంగా పార్టీ షర్మిల ద్వారా పెట్టించాలని జగన్ నిర్ణయించుకున్నాకనే, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు భావించాలేమో. అయితే, రాజకీయంగా తన పార్టీకీ, తన అన్న పార్టీకి సంబంధం లేదని షర్మిల అంటున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయంగా విభేదాలు వుంటాయనుకోలేం.

వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించాల్సింది వైఎస్సార్సీపీనే ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా. సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్ తెలంగాణలో ఎప్పుడు ప్రయోగించినా ఆ ప్రభావం షర్మిలపై వుండకూడదనే, షర్మిల కోసం ప్రత్యేకంగా రాజకీయ కుంపటి ప్రారంభమవుతోందని అనుకోవాలేమో.