అభివృద్ధికీ, సంక్షేమానికీ బ్రాండ్ అంబాసిడర్ వైఎస్సార్.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరు ఒకప్పుడు ప్రభంజనం. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఓ ప్రభంజనమే. ఆయన మరణించి ఏళ్ళు గడుస్తోంది. అయినా, రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన లేకుండా తెలుగునాట రాజకీయాలు నడవడంలేదు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ, సంక్షేమ పథకాల పేర్లు.. వాటి జాతకాలూ మారిపోవడం కొత్తేమీ కాదు. కానీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ కావొచ్చు, ఆరోగ్యశ్రీ కావొచ్చు.. ఇలా కొన్నింటి పేర్లు మారినా, వాటిలో స్ఫూర్తి మాత్రం మారదు. ఎందుకంటే, ఆయా సంక్షేమ పథకాల్ని మనసు పెట్టి ఆచరణలోకి తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

రాజకీయాల్ని పక్కన పెడితే, తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ సంచలనం. ‘స్వర్గీయ ఎన్టీయార్‌కి మేం శిష్యులం..’ అని చెప్పుకుంటారు కొందరు. అలాగే, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శిష్యులం..’ అని చెప్పుకుంటారు ఇంకొందరు. రాజకీయాల్లో ఎన్టీయార్ ఓ చరిత్ర అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అంతే.

సంక్షేమం, అభివృద్ధి.. ఈ రెండింటికీ.. ఎన్టీయార్, రాజశేఖర్ రెడ్డి.. ఇద్దరూ బ్రాండ్ అంబాసిడర్లని చెప్పక తప్పదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేస్తోంటే, తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ఈ రెండిటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. స్వచ్ఛమైన చిరునవ్వుకీ.. అచ్చ తెలుగు పంచెకట్టుకీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్.