జగన్ అనే మూడు అక్షరాలు 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాయి. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ పార్టీలకు, నాయకులకు చుక్కలు చుపించారు. ఎవ్వరు ఊహించని మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి అన్నగారు స్థాపించిన టీడీపీని పతనావస్థకు చేర్చారు. ఇంతటి బలమైన నాయకుడికి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుండే ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. సొంత పార్టీ నేతలే సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలను పట్టించుకోవడం లేదు. తన ఫోటోలు పెట్టుకొని గెలిచిన వారు తన మాటే వినకపోవడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
జగన్ మాటలను పట్టించుకోని ఎమ్మెల్యేలు
ఎవ్వరు ఊహించని మెజారిటీతో ఎన్నికల్లో జగన్ యొక్క మాటను ఆయన పేరుతో గెలిచిన నాయకులు పట్టించుకోవడం లేదు. ఎలాగో గెలిచాం కదా ఇంకా జగన్ తో పని ఏముందని అనుకున్నారో ఏమో కానీ వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేలు జగన్ మాటను అస్సలు పట్టించుకోవడం లేదు. వాళ్లేవారంటే విశాఖలో ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమరనాధ్, గోదావరి జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యే, గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి. ఈ ఎమ్మెల్యేలు జగన్ మాటను లెక్కచెయ్యడం లేదు అలాగే తమ ప్రవర్తన ద్వారా వైసీపీ యొక్క ఖ్యాతిని కూడా మంట కలుపుతున్నారు. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలు మంత్రులను విమర్శిస్తున్నారు, జగన్ యొక్క సామాజిక వర్గాన్ని కూడా విమర్శిస్తూ వైసీపీ యొక్క పరువును తీస్తున్నారు.
జగన్ ఎలా స్పందించనున్నారు!!
తన మాటను లెక్కచేయకుండా, పార్టీ పరువును తీసేలా వ్యవహరిస్తున్న ఈ నలుగురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందిందని,త్వరలోనే వాళ్లతో చర్చలకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది. పార్టీకి భంగం కలిగించే పని ఎవ్వరు చేసినా సహించేది లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రతిపక్షాల నేతలు లేనిపోని విమర్శలు చేస్తూ, కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్న తరుణంలో సొంత పార్టీ నేతలే ఇలా పార్టీకి భంగం కలిగిస్తూ, తన మాటను పట్టించుకోకపోతే సహించేది లేదన్న తీరులో జగన్ వ్యవహరిస్తున్నారని సమాచారం.