వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని వారాల క్రితం ఒక వ్యక్తి పేకాట క్లబ్ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అతను ఎమెల్యే శ్రీదేవి అనుచరుడనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఛానెళ్ళలో బాగా హైలెట్ అయింది. కానీ ఎమ్మెల్యే మాత్రం కావాలనే తన పేరును కేసులో ఇరికిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా ఆమె మీద మరో ఆరోపణ వెలుగుచూసింది. అదేమిటంటే శ్రీదేవి తన వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇప్పుడు ఇవ్వనని అడ్డం తిరిగినట్టు మేకల రవి అనే వ్యక్తి ఆరోపణ చేశాడు. ఆ వ్యక్తి కూడ వైసీపీకి చెందిన వ్యక్తే కావడంతో వ్యవహారం మరింత హైలెట్ అయింది.
డాక్టర్ శ్రీదేవి ఎన్నికల సమయంలో ఖర్చు కోసం ఒక భారీ మొత్తంలో తన వద్ద అప్పు తీసుకుందని, అందులో కొంత మొత్తం తిరిగి ఇచ్చినా ఇంకా చాలా ఇవాల్సి ఉందని, అడిగితే బెదిరిస్తున్నారని, పోలీసులతో కేసు పెట్టించి లోపల వేయిస్తానని బెదిరించినట్టు సదరు వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఎప్పుడైప్పుడు పాలక పార్టీ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షం ఈ విషయాన్ని పట్టుకుని నానా యాగీ చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సొంత పార్టీ నేతల నుండి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడం, ఆ తర్వాత ఏదో ఒక రూపాన వారి బాకీ తీర్చుకోవడం మామూలు సంగతే. కేవలం వైసీపీలో మాత్రమే కాదు అన్ని పార్టీల్లోనూ ఇది జరుగుతుంటుంది.
కానీ అవేవీ బయటకురావు. ఎలాంటి ఆర్థిక విషయాలైనా లోపలే ఉండాలి తప్ప బయటికి వెళ్లకూడదని హైకమాండ్స్ చెబుతుంటాయి. కానీ వైసీపీ ఎమ్మెల్యే విషయంలోనే ఈ వివాదం రేగడం చర్చనీయాంశమైంది. దీంతో ఎంత వీలైతే అంత త్వరగా ఈ ఇష్యూని పరిష్కరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కొందరేమో మంత్రుల ముందు పంచాయితీ పెట్టుకుంటే మంచిది అంటే ఇంకొందరు మాత్రం ఎమ్మెల్యే మీద ఆరోపణ కనుక నేరుగా వైఎస్ జగన్ వద్దకే వెళితే బాగుంటుందని అంటున్నారు. ఇద్దరూ వైసీపీ లీడర్లే కాబట్టి నిముషంలో విషయం తేలిపోతుందని అంటున్నారు. ఒక రకంగా అదే నిజ ఆర్థికపరమైన వివాదం కాబట్టి, ఇప్పటికే ప్రచారం బాగా పొంది ఉంది కాబట్టి జగన్ సమక్షంలో త్వరగా తేలిపోయే అవకాశం ఉంది. నిజంగానే ఎమ్మెల్యే శ్రీదేవి మోసం చేశారా లేకపోతే ఉద్దశ్యపూర్వకంగానే ఎవరైనా ఆమెను ఇరికిస్తున్నారా అనేది బట్టబయలవుతుంది.