ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి దక్కాల్సిన నీళ్ళ వాటాలో ఒక్క లీటరు నీటినీ తాము తీసుకోబోమని తెలంగాణ రాష్ట్రం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క గ్లాసు నీటిని కూడా తాము తరలించుకుపోయేది లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. అంటే, తెలుగు రాష్ట్రాల మధ్య అసలు నీళ్ళ పంచాయితీ వుండకూడదు. కానీ, రెండు రాష్ట్రాల మధ్యా ‘నీళ్ళ రచ్చ’ కొనసాగుతోంది.
ప్రాజెక్టుల పేరుతో ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటున్నారు. ఇంతకీ, ఈ వివాదంలో తప్పెవరిది.? ఏడేళ్ళుగా తెలంగాణ – ఆంధ్రపదేశ్ రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ జరుగుతోంటే, కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదన్న ప్రశ్నకు సమాధానమే దొరకడంలేదు. ఏ రాష్ట్రం ఫిర్యాదు చేసినా, వెంటనే కేంద్రం నుంచి ఆయా వివాదాస్పద ప్రాజెక్టుల పనులు ఆపేయాలని కేంద్రం చెబుతుంటుంది.
లేదంటే, సంబంధిత నదీ బోర్డులు తూతూ మంత్రంగా స్పందిస్తుంటాయి. మళ్ళీ వివాదం షురూ. ప్రాజెక్టుల మధ్య ఆయా రాష్ట్రాలు తమ బలగాల్ని మోహరించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి.? మంత్రులెందుకు తమ స్థాయిని తగ్గించుకుని, ప్రజల్ని చులకన చేసేలా మాట్లాడుతున్నారు.? రాజకీయం ముందు.. ఎవరైనాసరే విజ్నత కోల్పోవాల్సిందేనన్నట్టు తయారైంది పరిస్థితి. నీళ్ళ పేరుతో ప్రజల మధ్య చిచ్చ పెట్టడానికి రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు.
ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. ఈ వివాదంపై ఆంధ్రపదేశ్ కాస్త సంయమనం పాటిస్తోంది. అయితే, బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేయాలన్న ఏపీ ప్రభుత్వ ఆలోచన సమర్థనీయం కానే కాదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక్క చోట కూర్చుని సమస్యను పరిష్కరించకపోతే, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం పెరిగిపోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాల వల్ల నష్టపోయేది ఇరు రాష్ట్రాల ప్రజలే.