‘ఆంధ్రపదేశ్ ప్రజలు తెలంగాణలో వున్నారనే సంయమనం పాటిస్తున్నాం.. అలాగని, నోటికొచ్చినట్లు తెలంగాణ నేతలు విమర్శిస్తే చూస్తూ ఊరుకోం..’ అని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, క్యాబినెట్ భేటీ సందర్భంగా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకటి మాత్రం నిజం.. లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఆంధ్రలో పుట్టినోళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులేనంటూ తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
తెలంగాణ ప్రజలు, ఆంధ్రపదేశ్ ప్రజలేంటి.. మనమంతా భారతీయులమన్న కనీస సోయ.. బాధ్యతగల పదవుల్లో వున్న నాయకులకు లేకపోవడం దారుణం. అయితే, తెలంగాణ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నప్పుడు, ఆంధ్రపదేశ్ నాయకులు సంయమనం పాటించడం అంతకన్నా దారుణం. సమాధానం అటువైపునుంచి కూడా గట్టిగా వుండాల్సిందే.
ఎందుకంటే, ఇది నీటి సమస్య. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య. రెండేళ్ళుగా సమస్య నాన్చివేతకు గురవుతూ వచ్చింది. ఆ మాటకొస్తే, ఏడేళ్ళుగా ఇదే పరిస్థితి. తెలంగాణోళ్ళు తిడుతూనే వుంటారు.. సీమాంధ్రులు పౌరుషం లేనట్టు వుండాలంటే ఎలా కుదురుతుంది.? తెలంగాణలో కృష్ణా నది మీద శ్రీశైలం ఎగువన ఓ ప్రాజెక్టు కట్టే ఆలోచనలో వుంది కేసీయార్ ప్రభుత్వం.
దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన బాధ్యతను ఆంధ్రపదేశ్ ప్రభుత్వం విస్మరించినట్లే కనిపిస్తోంది. కేంద్రం ఎటూ ఈ వ్యవహారంలోకి దూరి పంచాయితీని సెటిల్ చేయదు. ఈలోగా, తెలంగాణ మంత్రులు, ఏపీ ప్రజల్ని, నాయకుల్ని దూషిస్తోంటే.. ఏపీ నేతలు, అందునా అధికార పార్టీ నేతలు చూస్తూ ఊరుకోవడం కొత్త అనుమానాలకు తావిస్తుంది.