YS Jagan Delhi Tour : వైఎస్ జగన్ ఢిల్లీ టూర్: కేంద్రం మెడలు వంచారా.? లేదా.?

YS Jagan Delhi Tour : కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రగల్భాలు పలికింది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు అప్పట్లో రాజీనామాలు కూడా చేశారు. సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేసేశారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు ఢిల్లీకి వెళ్ళారుగానీ, ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచలేకపోయారు.. ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. వైఎస్ జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, ‘కేంద్రం మెడలు వంచగలరా.? లేదా.?’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతూనే వుంది.

ఢిల్లీకి వెళుతున్న వైఎస్ జగన్, కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా మాత్రమే కాదు, ఏ విషయమ్మీద కూడా సానుకూల ‘ప్రకటన’ తీసుకురాలేకపోతున్నారు. ఎందుకిలా.? ఎందుకంటే, కేంద్రంలో బీజేపీ సంపూర్ణ బలంతో వుంది. ఏ రాష్ట్రం కూడా కేంద్రంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో బలంగా ఒత్తిడి తెచ్చే అవకాశమే లేదు.. తెచ్చినా ఉపయోగం లేదు.

అలాగని, కేంద్రానికి రాష్ట్రాలు బానిసత్వం చేస్తూనే వుండాలా.? అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదేమో.. అనుకోవాలి. కేంద్రం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇవ్వడంలేదని వైసీపీ ప్రభుత్వమే చెబుతోంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పెండింగ్ నిధులు రావడంలేదనీ అంటోంది.

మరి, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ తర్వాత కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందా.? అంటే, ఔనని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. చంద్రబాబు హయాంలో అయినా వైఎస్ జగన్ హయాంలో అయినా.. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్.. అంటే, ప్రయాణ ఖర్చులు దండగ.. అన్న అభిప్రాయం జనంలో బలపడిపోయింది.