ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. ఇందులో వింతేముంది.? రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రానికి విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం అనేది అత్యంత సాధారణమైన విషయం. సరే, కేంద్రం ఎలా రాష్ట్ర సమస్యలపై స్పందిస్తుంది.? అన్నది వేరే చర్చ.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన.. అనగానే, ఒకప్పుడు వైసీపీ అనుకూల మీడియా, ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా వెకిలి రాతలు రాయడం కూడా సర్వసాధారణమైపోయింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, వైసీపీ అనుకూల మీడియాలో నానా యాగీ జరిగేది. ఇప్పుడు అంతకు మించిన యాగీ వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా చేస్తోంది.
‘ఇటు కేసు, అటు టూరు.. జగన్ ఢిల్లీ పర్యటన మర్మమేమిటో.?’ అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతోందట. ఓ కీలకమైన వ్యక్తి అరెస్టు కాబోతున్నారట. దాన్ని నివారించేందుకోసమే వైఎస్ జగన్ ఢిల్లీకి వెళుతున్నారట, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ప్రాధేయపడబోతున్నారట. ఇదీ టీడీపీ అనుకూల మీడియాలో కనిపిస్తున్న కథనాల సారాంశం.
మరోపక్క, సీఎం జగన్ ఢిల్లీ టూర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ వైసీపీ అనుకూల మీడియాలో ఎలివేషన్లు షురూ అయ్యాయ్. కేంద్రం, రాష్ట్రం వైపు అస్సలేమాత్రం సానుకూలంగా చూడటంలేదన్నది ఓపెన్ సీక్రెట్. గడచిన మూడేళ్ళుగానే కాదు, అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఓ ప్రసహనంగా, ఖర్చు దండగ వ్యవహారంలా మారిపోయింది.
ఈసారేదో అద్భుతం జరుగుతుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అయిననూ పోయి రావలె హస్తినకు.! అంతే, అదంతే. ఇక కేసుల గొడవ అంటారా.? తెలుగునాట, దిక్కుమాలిన మీడియా వున్నంతకాలం.. రాష్ట్రం పరువు ఇలాగే పోతూనే వుంటుంది.