సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ హిట్టా.? ఫట్టా.?

YS Jagan Delhi Tour.. Hit Or Flopt?

YS Jagan Delhi Tour.. Hit Or Flopt?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీలు ప్లాంటు, ప్రత్యేక హోదా, 3 రాజధానులు.. ఇలా చెప్పకుంటూ పోతే, చిట్టా పద్దు పెద్దదే వుంది. ‘సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్..’ అని చెప్పుకుంటోంది అధికార వైసీపీ. అలా చెప్పుకోవాల్సిందే.. వేరే దారి లేదు.

చంద్రబాబు హయాంలో కూడా ఇదే పరిస్థితి. అయితే, అప్పటికీ ఇప్పటికీ కొన్ని తేడాలున్నాయి. అప్పట్లో చంద్రబాబు – ఎన్డీయేలో భాగస్వామి. దాంతో చంద్రబాబు ఢిల్లీకి వెళితే, ఆ హాంగామా వేరేలా వుండేది. కేంద్ర మంత్రులు, చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించేవారు ఢిల్లీలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘మాది పబ్లిసిటీ ప్రభుత్వం కాదు..’ అని చెబుతుంటుంది వైసీపీ. సరే, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర సమస్యల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందుంచి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే, రాష్ట్రానికి అంతకన్నా కావాల్సిందేముంది.? కానీ, కేంద్రం.. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడంలేదు. ఇది ఇప్పటి మాట కాదు. ఏడేళ్ళుగా జరుగుతున్నది అదే.

వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా వున్న సమయంలో పనులు కాస్త వేగంగా జరిగేవి. ఆ తర్వాత ఆగిపోయాయి. ఆయన ఎప్పుడైతే ఉప రాష్ట్రపతి అయ్యారో, ఆ తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కు అనేది లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం. పోలవరం ప్రాజెక్టుకి అవసరమైన నిధుల్ని వైఎస్ జగన్ సమక్షంలో కేంద్ర మంత్రి విడుదల చేసి వున్నా.. నీతి అయోగ్, రాష్ట్ర సమస్యల్ని అడ్రస్ చేస్తూ, పరిష్కారాన్ని వైఎస్ జగన్ సమక్షంలోనే పేర్కొని వున్నా.. వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ విజయవంతమైందని అనుకోవచ్చు.

ఇక్కడ రాష్ట్రం తరఫున ప్రయత్న లోపం వుందని ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు. తప్పంతా కేంద్రానిదే. కేంద్రం, ఆంధ్రపదేశ్ రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. అది ప్రత్యేక హోదా విషయంలో అయినా, మరో విషయంలో అయినా. జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయ్యిందని వైసీపీ చెప్పుకోవడమంటే, ఏమీ చేయని కేంద్రాన్ని సమర్థించినట్లే అవుతుంది తప్ప, రాష్ట్రానికి జరిగే మేలు మాత్రం ఏమీ వుండదు.