ఫ్లాప్ డైరెక్టర్లకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. ఐదోసారి అంటూ?

సాధారణంగా స్టార్ డైరెక్టర్ అయినా తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫ్లాప్ అయితే కొత్త ఆఫర్లు రావడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ఆయా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా బృందావనం సినిమాతో వంశీ పైడిపల్లి దర్శకునిగా ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్ కు జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ పూరీ కాంబినేషన్ లో టెంపర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 43 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

ఆ తర్వాత 1 నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ లో ఉన్న సుకుమార్ కు తారక్ ఛాన్స్ ఇవ్వగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న బాబీ స్టార్ డైరెక్టర్ కాకపోయినా ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జై లవకుశ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విధంగా ఫ్లాపుల్లో ఉన్న ఐదుగురు డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు ఆ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది.