సమన్యాయం: నిన్న చంద్రబాబుపైన.. నేడు లోకేష్ పైన.!

Yesterday On CBN, Today On Nara Lokesh

Yesterday On CBN, Today On Nara Lokesh

నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైన కర్నూలులో ఓ కేసు నమోదైన విషయం విదితమే. తప్పుడు సమాచారంతో కరోనా వైరస్ విషయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకి తొలుత నోటీసులు పంపుతామని పోలీసు అధికారులు తాజాగా ప్రకటించారు. అయితే, ఈ కేసు నిలబడేదే కాదంటూ అప్పుడే టీడీపీ శ్రేణులు జోస్యం చెప్పేస్తున్నాయి.

కరోనాపై సమాచారం పంచుకోవడం, ఆవేదన వ్యక్తం చేయడం.. వంటి విషయాలపై కేసులు నమోదు చేయవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నది తెలుగు తమ్ముళ్ళ వాదన. ఇదిలా వుంటే, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిజానికి, ఈ తరహా కేసులు ఎక్కువగా విపక్ష నేతల మీదనే నమోదవుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు, దుష్ప్రచారం విపక్షాలపై ఎన్నిసార్లు చేసినా, విపక్ష నేతలు పోలీసులకు ఎన్నిసార్లు వాటిపై ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు కావడంలేదన్నది విపక్షాల ఆరోపణ. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలేననుకోండి.. అది వేరే సంగతి. కాగా, తన మీద కేసు నమోదైన విషయంపై స్పందించిన నారా లోకేష్, ట్విట్టర్ వేదికగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పులికేశి రెడ్డి.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మళ్ళీ నారా లోకేష్ మీద కేసులు పెట్టాల్సి వస్తుందో ఏమో.!