టీడీపీ ప్లస్ జనసేన.. ఔను, వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారు.!

పైకి కత్తులు దూసుకుంటున్నట్టే కనిపిస్తారు.. తెరవెనుకాల మాత్రం కలిసి పనిచేస్తారు. ఇదెక్కడి రాజకీయం.? ఈ రాజకీయమే అంత. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల తీరు ఇది. పరిషత్ ఎన్నికల ఫలితాలొచ్చాయి.. అధికార వైసీపీ, రికార్డు విజయాన్ని అందుకుంది. ‘మేం అసలు పోటీలోనే లేం.. ఎన్నికల్ని బహిష్కరించాం.. అలాంటప్పుడు, ఓడిపోయామన్న పరిస్థితి మాకెందుకొస్తుంది.?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు. ఇంకోపక్క, జనసేన పార్టీ, ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్త తన ఉనికిని నిలబెట్టుకుంది. అయితే, టీడీపీ – జనసేన సంయుక్తంగా కొన్ని స్థానాల్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంపీపీ స్థానాల విషయంలో క్యాంపు రాజకీయాల్ని టీడీపీ నడుపుతోంటే, ఆ క్యాంపులవైపు జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు అడుగులేస్తున్నారు.

చిత్రమేంటంటే, వైసీపీ కూడా జనసేనకు గాలమేస్తుండడం. ఇంతకన్నా చిత్రం కూడా వుంది.. అదేంటంటే, టీడీపీ – వైసీపీ కూడా కలుస్తుండడం. ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచినప్పటికీ, స్థానిక పరిస్థితుల్ని బట్టి సర్దుబాట్లు జరిగిపోతున్నాయి. ఎటూ టీడీపీ తాము పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించామని చెబుతోంది కాబట్టి, జనసేనకు ఇది చాలా అడ్వాంటేజ్. తమవైపుకు టీడీపీ అభ్యర్థుల్ని (ఎంపీటీసీ, జెడ్పీటీసీల్ని) తిప్పుకోవానికి అవకాశం వుంది. కానీ, అంత సీన్ జనసేన పార్టీకి లేదు. జనసేననే టీడీపీ కలిపేసుకుంటోంది. టీడీపీని, జనసేనని కూడా వైసీపీ కలిపేసుకుంటోంది. ఫలితాలపై విశ్లేషించుకుంటాం.. అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ తరహా రాజకీయాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోతే, 2024 నాటికి జనసేనకు అభ్యర్థులే కరవయ్యేంత దారుణ పరిస్థితి రావొచ్చు.