తిరుపతి బై పోల్: బీజేపీపై వైసీపీ కౌంటర్ ఎటాక్ ఏదీ ఎక్కడ.?

YCP's Failure of giving counter attack to BJP

YCP's Failure of giving counter attack to BJP

‘జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి.? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట’ అంటూ వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రం సంధించిన విషయం విదితమే. నిజానికి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజామోదంతో విజయసాయిరెడ్డి పార్లమెంటుకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ తలచుకుంటే, చిరంజీవిలా రాజ్యసభకు వెళ్ళి వుండొచ్చు. ఇలాంటి విమర్శల ద్వారా విజయసాయిరెడ్డి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఎంపికయి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టొచ్చన్న విషయాన్ని విజయసాయి విస్మరిస్తే ఎలా.? ఇక, విజయసాయిరెడ్డి ట్వీటుకి బీజేపీ నుంచి గట్టి సమాధానమే వచ్చింది. ‘మీ అహంకారపు మాటల్ని నేలకూల్చే రోజు దగ్గర్లోనే వుంది. ఆ రోజు లోపలికి క్యాబేజీలతోపాటు బిస్కెట్లు కూడా పంపిస్తాం..’ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

ఇంకోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా బీజేపీ విరుచుకుపడింది. వాస్తవానికి ఇంతలా వైసీపీని బీజేపీ ఏనాడూ విమర్శించింది లేదు. బీజేపీ విషయంలో వైసీపీ అత్యుత్సాహం, వైసీపీ కొంప ముంచేలానే వుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రత్యేక హోదా విషయమై కేంద్రాన్ని వైసీపీ ఇంతవరకు నిలదీయకపోవడంతో, బీజేపీ దృష్టిలో వైసీపీ చులకనైపోయింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఏం చేస్తుందో ఇప్పటికైనా స్పష్టం చేయాల్సిన బాధ్యత వైసీపీ అధినాయకత్వంపైన వుంది. గతంలోలా నిరాహార దీక్షలు చేస్తారా.? ఎంపీ పదవులకు రాజీనామా చేయిస్తారా.? అన్న విషయాలపై ఏదో ఒక కీలక నిర్ణయం వైసీపీ అధిష్టానం తీసుకోవాల్సిందే. విశాఖ ఉక్కు విషయంలోనూ కేంద్ర బడ్జెట్ మీద ప్రశంసలు కురిపిస్తూ, సన్నాయి నొక్కులు నొక్కారన్న విమర్శలు జగన్ ఎదుర్కొంటున్నారు. కేవలం ట్వీట్లు వేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. తిరుపతిలో అసలు ఓట్లడగడానికి కూడా నైతిక హక్కు లేదనే స్థాయి నుంచి బీజేపీ, అక్కడ పాగా వేసే స్థాయికి దూసుకెళుతోందంటే, వైసీపీ నాయకత్వం.. బీజేపీ విషయంలో ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు.