రాజకీయాలు అంటేనే అలా ఉంటాయి కావచ్చు. సొంత పార్టీ నేతలే ఒక్కోసారి పార్టీపై విరుచుకుపడుతారు. తమ పార్టీ మీదనే అధికారం చలాయిస్తారు. ప్రతిపక్షంలా వ్యవహరిస్తారు. వైసీపీకి కూడా అటువంటి ఇబ్బంది ఒకటుంది. ఆయనే రఘురామకృష్ణంరాజు. వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచి.. తర్వాత ఆ పార్టీకే ఎదురుతిరిగారు రఘురామ. ప్రస్తుతం రెబల్ ఎంపీగా కొనసాగుతున్న ఈయన.. అప్పుడప్పుడు వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ పెద్దలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం గురించి మరో షాకింగ్ విషయాలు చెప్పారు.
ఏపీలో త్వరలో రాజకీయ సంక్షోభం తలెత్తబోతోందట. దాని వల్ల రాష్ట్రపతి పాలన రాబోతున్నదట. రెండు మూడు నెలల్లోనే ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుంది. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి అంటూ చెప్పుకొచ్చారు రఘురామ.
అలాగే.. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడటంపై కూడా రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడాలి నాని అలా అనడం వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కూడా కోరారు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి కన్నా.. మాట్లాడించిన వ్యక్తిదే తప్పు.. కాబట్టి.. ఎవరు మాట్లాడించారో.. వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కొడాలి నాని ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డపై ప్రయోగిస్తోందంటూ ఆయన విరుచుకుపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థపై ఇలా దాడి చేస్తే.. ఖచ్చితంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకముందే ప్రభుత్వం మేల్కొంటే మంచిది. లేదంటే… త్వరలోనే ఏపీలో పరిస్థితులన్నీ తలకిందులవుతాయని ఎంపీ హెచ్చరించారు.