వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అత్యంత అభిమానం ‘నిజాయితీ’గా చూపే అతి కొద్దిమందిలో ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డంలో రోజా అస్సలేమాత్రం వెనుకాడరు. సొంత పార్టీలో అయినాసరే, రోజా ‘ఫైర్ బ్రాండ్’ అనే ఇమేజ్ సంపాదించుకున్నారు. అదే ఇప్పుడు వైసీపీలో ఆమెకు మైనస్ అవుతోంది. వున్నది వున్నట్టుగా మాట్లాడటం వైసీపీలో చాలామందికి నచ్చకపోవడంతో, రోజాకి పొగపెడుతున్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజా, వైసీపీని వీడటం తప్ప ఇంకో మార్గం కనిపించడంలేదు..’ అంటూ నగిరి నియోజకవర్గంలో చాలామంది రోజా అనుచరులు భావిస్తున్నారు. రోజా, పార్టీ పరంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా, అక్కడ కొందరు వైసీపీ మద్దతుదారుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది.
తన నియోజవర్గంలోని ఓ ఎంపీపీ సీటు విషయమై రోజాకి, స్థానిక నేతల నుంచి తలనొప్పి ఎదురవడమే కాదు, ‘బస్తీ మే సవాల్.. నీకు దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్.. రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు గెలిస్తే, నువ్వు ఏం చెప్పినా చేస్తా..’ అంటూ వైసీపీ నేత ఒకరు రోజాకి, ఆమె సమక్షంలోనే సవాల్ విసిరారు. ఇదెక్కడి వింత.? ఓ ఎంపీపీ స్థానం విషయంలో ఎమ్మెల్యే మాట చెల్లకపోవడమా.? ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది.? నిజానికి, వైఎస్ జగన్ మంత్రి వర్గంలో రోజాకి అవకాశం దక్కి వుండాలి. కానీ, దక్కలేదు.. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి దక్కింది.. అదీ ఆమె స్థాయికి తగ్గ పదవి కాదు. ఇప్పుడు అదీ లేదాయె. మరెలా, రాజకీయంగా రోజా వైసీపీలో నిలదొక్కుకోగలరు.? టీడీపీలో వున్నప్పుడూ రోజాది ఇదే పరిస్థితి. టీడీపీలో సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని అప్పట్లో వాపోయారామె. ఇప్పుడూ అదే పరిస్థితిని రోజా వైసీపీలో ఎదుర్కొంటున్నారు. మరి, పార్టీ మారడం అనే ఆప్షన్ వైపు రోజా మొగ్గు చూపగలరా.? వేచి చూడాల్సిందే.