ఏపీ సీఎం వైఎస్ జగన్ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేస్తా అంటూ ప్రసంగాలు ఇస్తున్నారు. ఇటీవలే లంచగొండుల కోసం సపరేట్ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని కుండబద్ధలు కొట్టారు. బాగుంది.. ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయం. మరి వైసీపీ మాటేమిటి? తన పార్టీలో జరుగుతున్న దానిపై స్పందన ఏది? లేదా వైసీపీ నేతలు జగన్ కు తెలియకుండా ఇలాంటి అరాచకాలు చేస్తున్నారా? జగన్ మాట కూడా వినకుండా ఇలా తయారయ్యారా? అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
నిజమే.. ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అంతమాత్రాన వైసీపీ నేతలు ఏం చేస్తే అది చెల్లుతుందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కొన్ని రోజుల కింద అమరావతికి దగ్గర్లో రహస్యంగా నిర్వహిస్తున్న ఓ పేకాట క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో చాలా మొత్తంలో నగదు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. పోలీసుల విచారణలో తేలిందేంటంటే.. ఆ పేకాట నిర్వాహకుడు ఎవరో కాదు.. తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు.. అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక.. సోషల్ మీడియా ఉంది కదా.. రాష్ట్రమంతా డప్పేశారు. కానీ.. నాకు మాత్రం ఆ వ్యక్తి ఎవరో తెలియదు.. అంటూ శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. కానీ.. అప్పటికే చేతులు కాలాయి. అప్పుడు ఆకులు పట్టుకొని ఏం లాభం. తన గురించి సోషల్ మీడియాలో ఎప్పుడో ప్రచారం జరిగిపోయింది.
మరోవైపు మంత్రి గుమ్మనూరు సొంత ఊళ్లో ఉన్న పేకాట క్లబ్బులపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలోనూ సేమ్.. భారీ మొత్తంలో నగదును, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తేలిందేంటేంటే.. ఆ పేకాట క్లబ్ నిర్వాహకులు… మంత్రి గుమ్మనూరికి దగ్గరి వారు అని. దానిపైనా ప్రచారం జరిగింది. సేమ్.. శ్రీదేవిలాగానే.. ఆ పేకాట క్లబ్ కు, నాకు ఎటువంటి సంబంధం లేదు.. అంటూ ఆ ప్రచారాన్ని వ్యతిరేకించారు మంత్రి గుమ్మనూరు జయరాం.
ఇలా.. వైసీపీ బడా నేతలంతా సిల్లీగా పేకాట క్లబ్బుల పేరుతో అడ్డంగా దొరికిపోతుండటంతో సీఎం జగన్ కు చిరాకు వస్తోందట. వీళ్లకు ఎంత చెప్పినా కూడా మారడం లేదంటూ ఆయన సీరియస్ అవుతున్నారట. వైసీపీ పెద్దలకు కూడా ఇటువంటి వాళ్ల వల్ల పెద్ద తలనొప్పి మొదలైందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన నేతలు అయి ఉండి.. అందులోనూ ఎమ్మెల్యేలు, మంత్రులే ఇలాంటి ఛీప్ పనులు చేస్తే.. రేపు మళ్లీ ప్రజల దగ్గరికి వచ్చి ఎలా ఓట్లు అడుగుతారు.. అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.