ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన పార్టీ టీడీపీని ఘోరంగా ఓడించారు. అయినా కూడా చంద్రబాబు తీరు మాత్రం మారలేదు. ఏపీ ప్రజలు తనను ఓడించినందుకు వారిపై పగ తీర్చుకోవాలని అనుకున్నారు. అందుకే… కరోనా టైమ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో షెడ్యూల్ విడుదల చేయించారు… అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
ఓవైపు ప్రజలంతా కరోనా వల్ల భయపడి చస్తుంటే.. కరోనాతో ప్రపంచమే అల్లాడుతుంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అంత అర్జెంటా? ఎన్నికల్లో ఓటేయడం కోసం పోలింగ్ స్టేషన్ కు వచ్చి వైరస్ బారిన పడితే.. ఎవరు బాధ్యులు. అప్పుడు నీకళ్లు చల్లబడుతాయా చంద్రబాబు.. అంటూ రాంబాబు దుయ్యబట్టారు.
అసలు.. క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి అనుగుణమైన పరిస్థితులు లేనప్పుడు పోలింగ్ నిర్వహించకూడదు.. అనే ప్రాథమిక నియమాన్ని ఎన్నికల కమిషనర్ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. అంటూ అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబుకు ఏపీ ప్రజల మీద ఇంత కోపం ఎందుకు. ఎన్నికల కమిషన్ ను తొందరపెట్టి ఇలాంటి ప్రజలను కరోనా బారిన పడేయాలని చూస్తున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పుడు కరోనా రాదా? అని అడుగుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఖచ్చితంగా అందరూ రావాలనే నిబంధన ఏం లేదు. కానీ.. ఎన్నికలు అన్నప్పుడు పోలింగ్ అన్నప్పుడు అందరూ పోలింగ్ లో పాల్గొన్నాలి. 90 ఏళ్ల వృద్ధుడు కూడా పోలింగ్ లో పాల్గొనాలి.. అనే విషయం కూడా తెలియకుండా ప్రతిపక్షాలు చేస్తున్న గోల ఏంటి.. అంటూ ఎమ్మెల్యే అంబటి వ్యాఖ్యానించారు.