ఇప్పుడు అందరి టార్గెట్ అచ్చెన్నే

గత కొంత కాలంగా వైసీపీ టార్గెట్ మారింది. మునుపటితో పోల్చితే చంద్రబాబు దూకుడు తగ్గించడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీపై దుమ్మెత్తిపోసే బాధ్యతను ఎత్తుకున్న అచ్చెన్నాయుడిపై వైసీపీ అధినేత జగన్ తన అనుచర గణాన్ని ఉసిగొల్పుతున్నారు. దీంతో నిన్నటి వరకు చంద్రబాబు వర్సెస్ జగన్ గా సాగిన మాటల యుద్ధం. ఇప్పుడు వైసీపీ వర్సెస్ అచ్చెన్నాయుడిగా మారిపోయింది. అచ్చెన్నాయుడిని చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరి ఫోకస్ ఆయనపైకి మళ్లింది. నిన్న మొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి నియోజకవర్గస్థాయి నేతల వరకూ అందరి టార్గెట్‌ చంద్రబాబే అన్నట్లుగా ఏపీ రాజకీయం సాగేది. చివరకు తటస్థంగా ఉండాల్సిన స్పీకర్ తమ్మినేని సైతం అవకాశం చిక్కినప్పుడల్లా ఇప్పుడు అచ్చెన్నాయుడిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గస్థాయి నేతల నుంచి డిప్యూటీ సీఎం వరకూ అందరి టార్గెట్‌ అచ్చెన్నాయుడే. ఈ టార్గెట్ పాలిటిక్స్ తో  అచ్చెన్నాయుడు బాగా ఇబ్బంది పడుతున్నారంటా.

గత రెండేళ్లుగా అచ్చెన్నాయుడు నిత్యం సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన్ని కట్టడి చేయాలని భావించిన జగన్ సర్కార్ ఆయన్ని ESI స్కామ్‌లో పట్టుకుంది. దీంతో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు రావాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈయనపై వైసీపీ నేతలు తమ విమర్శల పదును పెంచేశారంటా.

బీసీ కార్పొరేషన్ల పదవులు, వరదలపై అచ్చెన్న చేసిన విమర్శలకు నలువైపుల నుంచి విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. దువ్వాడ శ్రీనివాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఇలా అందరికి ఫోకస్ అచ్చెన్నాయుడిపైకి మళ్లింది.

చంద్రబాబును సైలెంట్ చేసిన వైసీపీ ఇక అచ్చెన్నను కూడా అదే విధంగా కట్టడి చేస్తే ఇక తమకు ఎదురు ఉండదని భావిస్తోందంటా. దీంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు వేడెక్కిపోయాయి. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉండడంతో కొత్త వచ్చి పడుతున్న భారీ ఇమేజ్ తో జిల్లాలో పట్టు సాధించేందుకు అచ్చెన్న ప్రయత్నిస్తుండడంతో వైసీపీ అంతే ధీటుగా ప్రతిఘటిస్తోంది. దీంతో ఇంత కాలం ప్రశాతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.